దంచేసిన వాన | - | Sakshi
Sakshi News home page

దంచేసిన వాన

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

పుట్టపర్తి అర్బన్‌: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించగా సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం గంటలకుపైగా కురిసింది. ముఖ్యంగా గోరంట్ల, చిలమత్తూరు, ఓడీ చెరువు, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ధర్మవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి.

‘పల్స్‌ పోలియో’ను

విజయవంతం చేయండి

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో ఈనెల 28న నిర్వహిస్తున్న ‘పల్స్‌ పోలియో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో పల్స్‌ పోలియో నిర్వహణపై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... సున్న నుంచి ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. 28న పోలియో కేంద్రాల్లో చుక్కల పంపిణీ ఉంటుందని, ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారికోసం 29న సిబ్బంది ఇళ్లకే వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమం గురించి 27వ తేదీన అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ కొండయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి చెన్నారెడ్డి, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, ఎస్‌ఓ కళాధర్‌, ఐసీడీఎస్‌ పీడీ ప్రమీల, డీపీఓ సమత పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్‌ అతిసార పక్షోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ విడుదల చేశారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌లో

ప్రవేశాలకు నేడు ఎంపికలు

అనంతపురం న్యూటౌన్‌: డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ (కడప)లో 4, 5, 6వ తరగతుల్లో ప్రవేశాల కోసం మంగళవారం పుట్టపర్తిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి కిషోర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన వారిలో అర్హులైన వారందరికీ ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. ఎంపికల్లో భాగంగా ఎత్తు, బరువు, పరుగులు, జంప్స్‌ తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు ఉదయం ఏడుగంటలకు హాజరుకావాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement