బాలకృష్ణ పీఏలు దోచేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ పీఏలు దోచేస్తున్నారు

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

చిలమత్తూరు: ‘‘మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని బాలకృష్ణ పూర్తిగా విస్మరించారు. పాలన అంతా పీఏలకు వదిలిపెట్టారు. వారు అవినీతి, అక్రమాలకు తెగబడుతూ హిందూపురాన్ని దోచేస్తున్నారు’’ అని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సినిమాలకే పరిమితమైన ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని పీఏ చేతుల్లో పెట్టారన్నారు. వారు నియోజకవర్గంలోని సహజ వనరులన్నీ దోచేశారన్నారు. ఇప్పుడు సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తూ ఆరాచక శక్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో పోలీసులకు పట్టుబడిన దొంగనోట్ల ముఠా వెనుక టీడీపీ ముఖ్యనేత ఉన్నారని, అతన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే పీఏలు రూ. 40 లక్షలు తీసుకొని కేసును తప్పుదోవ పట్టించారన్నారు. తమ హయాంలో హిందూపురం పట్టణంలో రూ.92 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు... వైఎస్సార్‌సీపీ హయాంలోనే రూ.60 కోట్లు మంజూరైన విషయం గుర్తించాలన్నారు. పట్టణంలోని 80 అడుగులు ఉన్న రైల్వే రోడ్డును 70 అడుగులకు తగ్గించారన్నారు. ఎవరైనా అభివృద్ధి కోసం రోడ్లు వెడల్పు చేస్తారని, వీళ్లు ఉన్న రోడ్లను తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రోడ్ల పనుల్లోనూ ఇసుకకు బదులు డస్ట్‌ వాడుతున్నారని, కనీసం క్యూరింగ్‌ కూడా సరిగా చేయకుండా జేబులను నింపుకుంటున్నారన్నారు. ఎవరైనా తొలుత డ్రైన్లు వేసి ఆ తర్వాత రోడ్లు వేస్తారని, హిందూపురంలో మాత్రం రోడ్లు వేసి మళ్లీ డ్రైన్‌లు వేస్తున్నారన్నారు. ఆ పనులను కూడా స్థానికేతరులకు అప్పగించారన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని కోతలు కోసే ఎమ్మెల్యే బాలకృష్ణ...ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారో..ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా ఆయన తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం వారంలో కనీసం మూడు రోజులు హిందూపురంలోనే ఉండి అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు.

హిందూపురాన్ని అవినీతి, అక్రమాలకు

కేరాఫ్‌గా మారారు

అభివృద్ధి పనుల్లో భారీగా

అవినీతి, అక్రమాలు

వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి ధ్వజం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement