అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రత కరువైంది. ఇక్కడ కొంతకాలంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులే కాకుండా డాక్టర్లు సైతం భయపడుతున్నారు. ప్రత్యేకంగా పోలీసు ఔట్ పోస్టు కార్యాలయం ఏర్పాటు చేసి.. ఎస్‌ఐను నియమించినా ఫలితం మాత్రం కానరావడం లేదు.
ఔట్‌పోస్టులో ఇష్టారాజ్యం
పెద్దాస్పత్రి పోలీసు ఔట్‌పోస్టు కొందరికి విడిది కేంద్రంగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలతో పాటు ఘర్షణలతో వచ్చే వారి ఫిర్యాదులను ఔట్‌పోస్టులోనే నమోదు చేసి.. తర్వాత ఆయా పోలీసుస్టేషన్లకు బదిలీ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడ నమోదు చేయకుండా ఫోన్ ద్వారా ఆయా స్టేషన్లకు సమాచారం ఇస్తున్నారు. ఆయా స్టేషన్ల అధికారులే వచ్చి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. మరికొంత మంది బాధితులనే స్టేషన్లకు రప్పించుకుంటున్నారు. ఆ మాత్రం విధులకు ఔట్‌పోస్టులో ఒక ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఎస్‌ఐను ఎందుకు నియమించారో అర్థం కావడం లేదు. సాధారణంగా ఎక్కడైనా రోజుకు 8 గంటలు కాని.. 12 గంటలు కాని విధులు నిర్వర్తిస్తారు. కానీ ఔట్‌పోస్టులో మాత్రం రోజుకొకరు చొప్పున విధుల్లో ఉంటున్నారు. ఈ లెక్కన ఎన్ని రోజులకొకసారి విధులకు వస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ శాతం సుమారు పదేళ్లుగా తిష్ట వేయడం గమనార్హం.
రాత్రి గస్తీ శూన్యం
పెద్దాస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల భద్రత కోసం పోలీసు ఔట్‌పోస్టు అధికారులతో పాటు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. ఔట్‌పోస్టు సిబ్బంది అయితే ఆస్పత్రిలో జరిగే పరిణామాలతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో నిత్యం ఘర్షణలు, దొంగతనాలు, నేరాలు జరుగుతున్నాయి. ఆస్పత్రి బయటే కాదు.. లోపల కూడా దాడులు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలతో డాక్టర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.
విడిది కేంద్రంగా పోలీసు ఔట్‌పోస్టు
నిత్యం ఘర్షణలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరు
చీకటి పడితే చాలు దొంగల బెడద
ఎస్‌ఐను నియమించినా ప్రయోజనం శూన్యం
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఆస్పత్రి ప్రాంగణంలో చెప్పులతో దాడి చేసుకున్నారు. దాదాపు గంట పాటు రణరంగాన్ని సృష్టించినా.. ఔట్‌పోస్టు సిబ్బంది దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు.
14 రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఎమర్జెన్సీ వార్డు సిబ్బందిని నానా దుర్భాషలాడినా.. అడ్డుకునే వారు లేరు.
రోజూ చీకటి పడితే చాలు దొంగలకు అడ్డాగా మారిపోతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు సెల్‌ఫోన్లు మాయం అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఎఫ్‌ఆర్‌ఎస్ విభాగంలో పనిచేస్తున్న శంకర్ అనే ఉద్యోగికి చెందిన ద్విచక్ర వాహనాన్ని పట్టపగలే అపహరించారు.
ఇటీవల పీజీ డాక్టర్‌కు సంబంధించిన రూ.50 వేలకు పైగా విలువజేసే వాచ్‌ను పట్టపగలే చోరీ చేశారు. డాక్టర్ విధులు నిర్వర్తించే సమయంలో చేతికి ఉన్న వాచ్‌ను బ్యాగులో వేసుకోవడాన్ని పసిగట్టిన దొంగ చాకచక్యంగా కొట్టేశాడు.
ఆత్మకూరు మండలం సింగంపల్లికి చెందిన ఓ మహిళ పిల్లలతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. మతిస్థిమితం లేని వ్యక్తి పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐదారు నెలల్లోనే అనేక ఘటనలు, ఘర్షణలు, దొంగతనాలు జరిగాయి. ఔట్‌పోస్టు సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు అంటున్నారు.
త్వరలో ప్రక్షాళన చేస్తాం
నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వాస్పత్రిని, ఔట్‌పోస్టు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశాను. పోలీసు సిబ్బందితో పాటు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందితోనూ మాట్లాడాను. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశాను. త్వరలోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. నేరాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాం.
– పుల్లయ్య, సీఐ,
అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్


