పుట్టపర్తి: మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలో ఆయన కాన్వాయ్‌ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి శ్రీధర్‌రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. గన్‌మెన్, డ్రైవర్‌తో సహా నలుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు గాయపడ్డారు. వివరాలు.. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అపర్ణారెడ్డి దంపతులతో పాటు మరికొందరు ముదిగుబ్బ సమీపంలో జరుగుతున్న ఓ శుభ కార్యానికి పుట్టపర్తి నుంచి ఆదివారం ఉదయం మూడు వాహనాల్లో బయలు దేరారు. మొదటి వాహనంలో శ్రీధర్‌రెడ్డి దంపతులు, మిగిలిన రెండు వాహనాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్తున్నారు. అయితే బుక్కపట్నం మండల పరిధిలోని బుచ్చయయ్యగారిపల్లి సమీపంలో 342 జాతీయ రహదారిపై హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులకు ఉపయోగిస్తున్న టిప్పర్ ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఒక్కసారి కుడివైపు తిరిగింది. దీంతో వెనుకనే వస్తున్న స్కార్పియో వాహనాన్ని టిప్పర్ ఢీ కొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నారాయణరెడ్డి, తిరుపాల్‌రెడ్డి, గన్‌మెన్ రామమోహన్‌రెడ్డి, భాస్కర్, డ్రైవర్ హర్ష, సుధాకర్‌లకు గాయాలయ్యాయి. అయితే శ్రీధర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం 50 మీటర్లకు పైగా ముందుగా వెళ్తుండటంతో ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను హుటాహుటిన పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి క్షతగాత్రులకు చికిత్స చేయించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో బాధితుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. చికిత్స పొందుతున్న వారిని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు.
కాన్వాయ్‌ని ఢీకొన్న టిప్పర్
సురక్షితంగా బయట పడిన శ్రీధర్‌రెడ్డి దంపతులు
డ్రైవర్, గన్‌మెన్‌తో సహా ఆరుగురికి గాయాలు


