కాశీంస్వామికి నిత్య పూజ నివేదన | - | Sakshi
Sakshi News home page

కాశీంస్వామికి నిత్య పూజ నివేదన

Jun 21 2026 12:13 AM | Updated on Jun 21 2026 12:13 AM

బత్తలపల్లి:మొహర్రంలో భాగంగా బత్తలపల్లిలో కాశీంస్వామికి శనివారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. ఉదయం ముజావర్లు టైలర్‌ రియాజ్‌, నూరుల్లా, మాభాషా, కాశీంవలిలు కాశీంస్వామి చావిడిలో ఫాతెహ చేశారు. మండలంలోని గంటాపురం, ముష్ఠూరు, మాల్యవంతం, సంజీవపురం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం తదితర గ్రామాల్లో వేడుకలకు అంకురార్పణ చేశారు. ఎస్‌ఐ సోమశేఖర్‌ వివిధ గ్రామాల పెద్దలు, ముజావర్లతో పోలీస్‌ స్టేషన్‌లో సమావేశం నిర్వహించి చర్చించారు. పోలీసుల అనుమతి లేకుండా ఉత్సవాలు నిర్వహించరాదన్నారు. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ తెలిపారు.

అసాంఘిక శక్తులపై

ఉక్కుపాదం మోపండి

పుట్టపర్తి టౌన్‌: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం పెనుకొండ పట్టణంలోని ఎన్‌ గార్డెన్‌ కన్వెన్షన్‌ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి కేసులోనూ పక్కాగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సమాజానికి హానికరంగా మారిన వ్యక్తులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. రౌడీషీటర్లకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు.ఆర్టీసీ బస్టాండుల్లో చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నైట్‌ విజన్‌ డ్రోన్లతో నిఘా పెంచాలన్నారు. ఆలయాలు, వీధుల్లో, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పునారావృతం కాకుండా చూసుకోవాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులకు క్యాష్‌ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. అవార్డులు పొందిన వారిలో గోరంట్ల సీఐ శేఖర్‌, కదిరి అర్బన్‌ సీఐ నారాయణరెడ్డి, ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ రెడ్డెప్ప, కదిరి రూరల్‌ సీఐ నిరంజన్‌ రెడ్డి, హిందూపురం సీఐ రాజగోపాల్‌నాయుడు, సీకేపల్లి సీఐ సత్యనారాయణ ఉన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు అంకిత సురానా, కేవీ మహేష్‌, డీఎస్పీలు నర్సింగప్ప, శివనారాయస్వామి, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐలు నరేంద్రరెడ్డి, లక్ష్మీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరంలో యువకుడికి మలేరియా పాజిటివ్‌

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో లోకేష్‌ అనే యువకుడికి శనివారం మలేరియా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. విషయం తెలుసుకున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు జయంతికుమార్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ నివారణ అధికారి జయరామ్‌నాయక్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో లోకేష్‌ను చేర్పించి వైద్యమందించారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది కాలనీలోని ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేశారు. 200 మందికి రక్తపరీక్షలు చేయించారు. దోమలు ప్రబలకుండా స్ప్రే చేశారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement