ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి ప్రవచించిన సూక్తులు ఆధునిక యువత భవితకు సత్య దీప్తులు’ అన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన భక్తులను తన్మయ భరితులను చేసింది. పర్తి యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సత్యసాయి గ్లోబల కౌన్సిల్ జోన్–5 ఇండోనేషియా భక్తులు శుక్రవారం పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ‘వన్ వరల్డ్ వన్ సాయి’ అన్న పేరుతో సత్యసాయి వైభవాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని, సేవా గుణాన్ని వివరిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. సాయినామంతో సాయి కుల్వంత సభా మందిరం ప్రతిధ్వనించగా.... భక్తులు పరవశించిపోయారు. అనంతరం సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ బాలి కోఆర్డినేటర్ జినీ ఆగష్ ఇండోనేషియాలో కొనసాగిస్తున్న సత్యసాయి సేవా కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం ఇండోనేషియా దేశానికి చెందిన బాలవికాస్ చిన్నారులు నేటి కంప్యూటర్ యుగంలో యువత సత్యసాయి మార్గాన్ని ఆచరించాలని, ఆయన బోధనలను పాటిస్తూ చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాలని ‘సాయి ఆల్‌వేస్ క్లిక్స్ ’ నాటికను ప్రదర్శించారు. చక్కటి భక్తి గీతాలతో కనువిందు చేసే నృత్య భంగిమలతో ఆహూతులను అలరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


