హోంమంత్రి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో దమనకాండ | - | Sakshi
Sakshi News home page

హోంమంత్రి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో దమనకాండ

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

పుట్టపర్తి అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వంలో హోంమంత్రి అనిత నిర్లక్ష్యం, డీజీపీ మౌనం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఉండడంతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుట్టపర్తిలో ఎస్సీ సెల్‌ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతగాని తనంతోనే మాదిగ క్రాంతికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ సీఐ నాగరాజును శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి హోంమంత్రి అనిత బాధ్యతారాహిత్యమే కారణమన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయి ఉండి దళిత మహిళలకు రక్షణ కల్పించలేకుండా పోతున్నారన్నారు. దాడులపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని, హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు భాస్కర్‌, నియోజకవర్గ అధ్యక్షుడు ఓబులేసు, నారాయణస్వామి తదితరులు ఉన్నారు.

యువ రైతుపై దాడి

బత్తలపల్లి: భూ సమస్యపై ధర్మవరం విచ్చేసిన కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఓ యువరైతుపై మరో రైతు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అడ్డువచ్చిన రైతు తల్లిని పక్కకు లాగేశారు. ఈ సంఘటన మండలంలోని తంబాపురం క్రాస్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత రైతు మాదినేని మహేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ... మండలంలోని రామాపురానికి చెందిన మాదినేని మహేంద్ర, మరో రైతు రామానాయుడు మధ్య భూ సమస్య ఉంది. ఈ సమస్యపై మహేంద్ర తన తల్లి అరుణతో కలిసి ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేయడానికి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. గమనించిన అదే గ్రామానికి చెందిన మరో రైతు రామానాయుడు వారిని గమనించి వెంబడించి తంబాపురం క్రాస్‌ ఆంజనేయస్వామి గుడి వద్దకు రాగానే అడ్డగించి దుర్భాషలాడాడు. ‘మా భూమి మేము చేయించుకుంటే నీకేమి’ అని సమాధానం ఇవ్వడంతో నాకే ఎదురు చెబుతావా అంటూ అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు తెలిపారు. అడ్డుకోబోయిన తల్లి అరుణను కూడా పక్కకు లాగేసి మరీ దాడి చేశాడన్నారు. తీవ్రంగా గాయపడిన మహేంద్రను బత్తలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తనను చంపడానికి ప్రయత్నించారంటూ రామానాయుడిపై పోలీసులకు మహేంద్ర ఫిర్యాదు చేశారు.

కుక్కల దాడిలో జింకకు గాయాలు

నార్పల: మండల పరిధిలోని తుంపెర గ్రామ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి జింకపై కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో రైతు సంజీవరాయుడు అప్రమత్తమై కుక్కల బారి నుండి జింకను కాపాడి అటవీశాఖ అధికారులుకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను అటవీశాఖ అధికారులు ఉషారాణి, తేజేశ్వర్‌రెడ్డి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ సాయి సుప్రజ పర్యవేక్షణలో రాజారెడ్డి , ధనమ్మ, గురుప్రసాద్‌ చికిత్స చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement