సాక్షి, పుట్టపర్తి
రెండేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఉరుములు, మెరుపులతో దట్టమైన మేఘాలు కమ్ముకున్నా సరైన వర్షం కురవడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు లోపలికి వెళ్లడంతో బోరుబావులు ఎండిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటి కష్టాలు జఠిలమయ్యాయి. ఏ గ్రామంలో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ‘నీళ్లో రామచంద్రా.. నీళ్లివ్వండి ప్రభో.. దాహం దాహం..’ అంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అప్పటికప్పుడు అధికారులు తాత్కాలికంగా సమస్య పరిష్కరిస్తుండటంతో వారం రోజులు తిరగకుండా సమస్య పునరావృతం అవుతోంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో ఉన్నఫలంగా సమస్య ఉత్పన్నం అవుతోంది. దీంతో మడకశిర, రొళ్ల, అగళి, ముదిగుబ్బ, ఓడీ చెరువు, లేపాక్షి, హిందూపురం తదితర ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. మహిళలు రోడ్డెక్కిన రోజు రెండు వాటర్ ట్యాంకర్లు పంపించి మమ అనిపిస్తున్నారు.
మంత్రి ఇలాకాలోనూ ఇక్కట్లే
జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేయలేకపోయారు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల వారు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. అదేవిధంగా మరో మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి, రొద్దం మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. జనం తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ఎవరూ వారి తాగునీటి కష్టాలను తీర్చడం లేదు.
మడకశిరలో రోజూ నిరసనలే..
కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. ఏ గ్రామంలో చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు చాలా గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. పాలకులు గ్రామాలకు నీళ్లు ఇవ్వక.. ప్రజలు బోర్లు వేసుకోలేక.. నానా అవస్థలు పడుతున్నారు. మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తూ.. ప్రజల సమస్యలను గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
వర్షాకాలంలోనూ పల్లె గొంతు తడారుతోంది. ముందస్తు చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాలపై పాలకులు దృష్టి సారించక పోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయినా స్పందించేవారే లేకపోవడంతో కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నారు.
వానాకాలంలోనూ తాగునీటి తిప్పలు
చాలా చోట్ల ఎండిపోయిన బోరుబావులు
18 మీటర్ల లోతుకు చేరిన భూగర్భ జలాలు
‘వాల్టా చట్టం’ పరిధిలో ఉన్న 51 గ్రామాలు
కనీస చర్యలు తీసుకోని
అధికారులు, పాలకులు
నెలల తరబడి నీరురాక రోడ్డెక్కుతున్న ప్రజలు
మడకశిర నియోజకవర్గంలో పరిస్థితి తీవ్రం
వీరంతా అగళి మండలం కురసాంగనపల్లి గ్రామస్తులు. తాగునీటి కోసం ఇటీవల ఖాళీ బిందెలతో ఇలా రోడ్డుపై నిరసన తెలిపారు. రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన బోరులో నీటిమట్టం తగ్గిపోయి నీళ్లు తక్కువగా వచ్చేవి. దీంతో ఎక్కువ సమయం మోటరు వేయడం వల్ల ఇటీవల కేబుల్ కాలిపోయింది. రోజుల తరబడి అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
ఏడాదిలో ఆరు మీటర్ల లోతుకు..
గతేడాది మే నెలలో 12 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం.. ఆ తర్వాత కురిసిన వర్షాలతో నవంబరులో 10 మీటర్ల పైకి వచ్చింది. అయితే ఈ ఏడాది వేసవిలో మరింత లోతుకు చేరింది. గత మే నెలలో భూగర్భ జల శాఖ గణాంకాల ప్రకారం 18.28 మీటర్ల లోతుకు చేరింది. దీంతో నీటి సమస్య తీవ్రమైంది.


