కదిరి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనడుస్తోంది. ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభం కాగా, బూత్ స్థాయి ఎన్నికల అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాంలు అందజేసి, వివరాలను లాగిన్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఆ పత్రాల్లో ప్రతి ఓటరు తమ వివరాలను నింపి, తిరిగి వారికి అందజేయాలి. ఇందుకు గడువు జూలై 14 వరకూ ఉంది. కానీ చాలా మంది ఎన్యూమరేషన్ ఫాంను ఏదో కాగితం అనుకుని పడేస్తున్నారు. అలాంటి వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల బీఎల్‌ఓ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫాం పూర్తి వివరాలతో నింపి తిరిగి అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే అధికారులు ఆబ్సెంట్, షిఫ్టెడ్ లేదంటే డెత్ అని జాబితాలో పొందుపరుస్తారు. తర్వాత ‘‘మేమున్నాము బాబు’’ అని నిరూపించుకోవడానికి అవసరమైన ఫారాలు జతచేసి, నిరీక్షించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) ఒక్కొక్కరు గరిష్టంగా 50 వరకు ఫాంలను బీఎల్‌ఓలకు అందజేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధానించిన ఫోన్ నంబర్‌ను విధిగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఫోటోలు తప్పనిసరి..
బీఎల్‌ఓలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఓటర్లు తమ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను ఎన్యూమరేషన్ ఫాంపై అతికించి వారికి అందజేయాలి. వారు వాటిని అప్‌లోడ్ చేస్తారు. ఒకవేళ ఆ ఫొటోలో తేడా వస్తే తిరస్కరణకు గురవుతుంది. అలాగే బీఎల్‌ఓ ఇచ్చే రసీదు భద్రంగా దాచుకోవాలి.
కుటుంబీకులెవరైనా ఇవ్వొచ్చు
తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను ఆ ఇంట్లో ఉన్న వారెవరైనా ఇవ్వొచ్చు. వారే ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫాంలను నింపి, వారే సంతకం చేసి బీఎల్‌ఓలకు ఇవ్వొచ్చు. ఓటరే ఉండాలనే నిబంధనేమీ లేదు. ఈ విషయంలో బీఎల్‌ఓలు సహకరించకపోతే వారిపై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
నోటీసు ఇచ్చాకే తొలగించాలి..
బీఎల్‌ఓలు ఇంటింటి సర్వేకు వెళ్లకుండా ఎవరో చెప్పిన దాని ప్రకారం ఓటు తొలగిస్తే ఎన్నికల కమిషన్ వారిపై చర్యలు తీసుకుంటుంది. ఓటరు అందుబాటులో లేరని ముందుగా పోలింగ్ కేంద్రంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించడానికి వీల్లేదు. ఈఆర్‌ఓ నిర్ణయంపై అభ్యంతరముంటే 15 రోజుల్లోపు కలెక్టర్‌కు, 30 రోజుల్లోపు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ)కు అప్పీలు చేసుకోవచ్చు.
‘సర్’ సర్వేపై అధికారుల సూచనలు
ఎన్యూమరేషన్ ఫాం నింపి
బీఎల్‌ఓలకు తిరిగి అందజేయాలి
లేకపోతే ఓటు గల్లంతవడం ఖాయం
జిల్లాలో జూలై 14 వరకూ
ఇంటింటి సర్వే
ఆన్‌లైన్‌లోనూ నమోదు చేయొచ్చు
ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న జిల్లా ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేయవచ్చు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కోసం బీఎల్‌ఓ ప్రతి ఇంటికీ మూడు సార్లు వెళ్లాలి. ఓటర్లు వివరాలను నింపి, కలర్ ఫొటో అతికించిన ఎన్యూమరేషన్ ఫాంను కచ్చితంగా తిరిగి బీఎల్‌ఓలకు అందజేయాలి. వాటిని బీఎల్‌ఓలు డిజిటలైజ్ చేస్తారు.
– శ్యాంప్రసాద్, కలెక్టర్


