సాక్షి, టాస్క్‌ఫోర్స్: హిందూపురంలో అధికార కూటమి నాయకులు అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సహజ వనరులన్నీ దోచేసిన నేతలు...సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. చివరకు గుజిరీ వ్యాపారులను వదలడం లేదు. ఇంటింటికీ తిరిగి గుజిరీ సేకరించి వారి వద్ద సామగ్రి కొని విక్రయించే వారిని మామూళ్లకోసం వేధిస్తున్నారు. నెలవారీగా తమకు రూ. 50 వేలు ఇవ్వాలని గుజరీ వ్యాపారులకు జనసేన, బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతలు అల్టిమేటం జారీ చేసినట్లు బాధితులు వాపోతున్నారు.
ఇటీవల పెరిగిన వేధింపులు
హిందూపురంలో చాలా మంది నిరుపేదలు పాత ఇనుము, ప్లాస్టిక్, కాగితం వంటి వస్తువులను సేకరించి స్థానికంగా స్క్రాప్ వ్యాపారులకు విక్రయించి పొట్టపోసుకుంటున్నారు. సదరు వ్యాపారులు తాము సేకరించిన గుజిరీని బెంగళూరు లాంటి నగరాలకు తరలిస్తుంటారు. వీరిపై కన్నేసిన జనసేన, బీజేపీ నాయకులు మామూళ్ల కోసం వ్యాపారులపై వేధింపులకు దిగారు. తాము అడిగినంత ఇవ్వకపోతే వ్యాపారాలు చేసుకోనివ్వబోమంటూ భయపెడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే కొందరు వ్యాపారులపై పోలీసులను ప్రయోగించగా...మిగతా వ్యాపారులంతా దుకాణాలకు తాళం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గుజిరీ సేకరించే నిరుపేదలు తాము సేకరించిన సామగ్రిని కొనేవారు లేక పస్తులుంటున్నారు.
15 రోజుల నుండి పెరిగిన ఒత్తిళ్లు..?
గత రెండు వారాలుగా గుజిరీ వ్యాపార కార్యకలాపాల మీద కూటమి నేతలు నిఘా పెట్టి వ్యాపారుల వద్ద బేరసారాలు జరిపినట్టుగా తెలుస్తోంది. మాట వినకపోతే వ్యాపారమే చేసుకోనివ్వబోమంటూ బెదిరించినట్టుగా బాధితులు చెబుతున్నారు. గుజిరీ వ్యాపారంలో ఎక్కువగా మైనార్టీ వర్గానికి చెందిన వారే ఉండగా, వారిని లక్ష్యంగా చేసుకున్న జనసేన , బీజేపీ నియోజకవర్గస్థాయి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ వసూళ్ల దందా వెనుక ఎమ్మెల్యే పీఏలు ఉన్నారా..? లేక బీజేపీ, జనసేన నేతలే ఉన్నారా... అన్నది తెలియడం లేదు.
సీటీఓతో ఒత్తిడి తెచ్చేందుకు విఫలయత్నం
కూటమి నేతల డిమాండ్‌కు వ్యాపారులు ఒప్పుకోకపోవడంతో సదరు నేతలు సీటీఓ ద్వారా గుజరీ దుకాణాలపై దాడులు చేయించాలని ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. కానీ సీటీఓ అందుకు అంగీకరించకపోవడంతో నేరుగా బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమ జేబులు నింపుకునేందుకు చిరు వ్యాపారులనూ వదలకుండా మామూళ్ల వసూళ్లకు పాల్పడటంపై ఓ వర్గం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
మామూళ్ల కోసం
గుజిరీ వ్యాపారులకు వేధింపులు
‘పురం’లో పెచ్చుమీరిన
జనసేన, బీజేపీ నేతల అకృత్యాలు


