● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
రొద్దం (పెనుకొండ రూరల్): ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే (సర్)పై అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ సూచించారు. బుధవారం ఆమె మండలంలోని తాడంగిపల్లి, ఎం. కొత్తపల్లి, నారనాగేపల్లి, బూచర్ల, లోచర్ల పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ..బీఎల్‌ఓలు సర్వే చేసే సమయంలో తప్పకుండా వారి వెంట ఉండాలన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. ఎన్యూమరేషన్ ఫాం పూరించడంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలు సంబంధిత అధికారులకు అందచేసే వరకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, మండల లెవెల్ బూత్ కో–ఆర్డినేటర్ చిలకల రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి యోగాంధ్ర
పోటీలకు విద్యార్థులు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలకు జిల్లా నుంచి 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి పంపినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విద్యార్థులను అటెండర్లతో కలిిపి ప్రత్యేక బస్సులో పంపినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కిశోర్, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, ఆయుష్ నోడలాఫీసర్ అర్చన, టూరిజం అధికారి ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఉద్యానశాఖ ఏడీ
దేవానందకుమార్ బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీహెచ్) ఆర్.దేవానందకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ అయ్యారు. అక్కడ ఏపీఎంఐపీ పీడీగా ఉన్న సుదర్శన్ గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో డిప్యుటేషన్ కింద దేవానంద్‌కుమార్‌ను బదిలీ చేస్తూ బుధవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 రోజులుగా సత్యసాయి జిల్లా ఇన్‌చార్జ్ పీడీగా ఏపీఎంఐపీ ఏపీడీ బీసీ ధనుంజయ పనిచేస్తున్నారు.


