పెనుకొండ: సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్‌ఓ ఎస్. ఫైరోజబేగం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించి తగిన సూచనలు సలహాలు అందించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పలు కార్యక్రమాల ప్రగతి నివేదికలను వైద్యాధికారి ఓంకార్‌ను అడిగి తెలుసుకున్నారు. అన్నింటా వంద శాతం లక్ష్యాలను సాధించాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం డీపీఓ నాగరాజు, ఎంపీహెచ్‌ఈఓ గఫుర్ పాల్గొన్నారు.
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ పరలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
తాడిపత్రి రూరల్: మండలంలోని పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాడిపత్రి అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గంగాదేవిపల్లికి చెందిన సతీష్ (25), నాగేంద్ర ద్విచక్రవాహనంలో మంగళవారం రాత్రి తాడిపత్రిలో నిర్వహించిన తమ స్నేహితుడు సతీష్ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్‌కు ఆస్పత్రిలో చికిత్సలందించారు. ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మృతుడు సతీష్‌కు భార్య పుష్పతో పాటు రెండు నెలల చిన్నారి ఉన్నట్లు తెలిసింది.
డబ్బుల కోసం
యూట్యూబర్ వేధింపులు
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన
గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్
గుంతకల్లు: డబ్బుల కోసం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న యూట్యూబర్ మంజునాథనాయుడుపై బుధవారం గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ షామీర్‌బాషా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. మంజునాథనాయుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించి బ్లాక్‌మెయిల్ చేయడంతోపాటు విధులకు అడ్డు తగులుతున్నాడని షామీర్‌బాషా పేర్కొన్నారు. అడిగినంత ఇవ్వని పక్షంలో లేనిపోని ఆరోపణలతో వీడియోలు చేసి సోషియల్ మీడియా ద్వారా వైరల్ చేస్తానని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. 2023లో కూడా ఇదే విధంగా బెదిరించగా, జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మంజునాథనాయుడుపై కేసు నమోదు చేయాలని కోరారు.


