రేపు మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు మెగా జాబ్‌మేళా

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

ప్రశాంతినిలయం: పుట్టపర్తిలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో శుక్రవారం మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. 10 బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జీతం ఉంటుందన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకొని హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 7981541994ను సంప్రదించాలన్నారు.

కాలు జారి కింద పడి మహిళ మృతి

కదిరి టౌన్‌: కాలు జారి కింద పడడంతో తీవ్ర గాయాలైన మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక సైదాపురంలోని నల్లాపురం గుడి సమీపంలో నివాసముండే పసుపులేటి నాగమణి (45) బుధవారం తన కుమారుడు మోహన్‌ క్రిష్ణ నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లింది. ఇంటిపైకి బకెట్‌లో నీరు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయమైన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించేలోపే పరిస్థితి విషమించి నాగమణి మృతి చెందింది. మోహన్‌ క్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

కుళ్లాయిస్వామి గోవిందా..

గూగూడులో ప్రారంభమైన

మొహర్రం ఉత్సవాలు

నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారి ప్రథమ దర్శనంతో భక్తజనం పులకించింది. తొలుత ప్రధాన అర్చకులు ఉస్సేనప్ప ఆధ్వర్యంలో కుళ్లాయి స్వామి పీర్ల చావిడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. అనంతరం పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు. స్వామి వారి ప్రథమ దర్శనం కోసం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రథమ దర్శనంతో భక్తులు గోవిందా.. గోవింద అంటూ నామస్మరణ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శోభారాణి, ఎస్‌ఐ సాగర్‌, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement