ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణానికి చెందిన జానపద గాయని సోమిశెట్టి సరళ కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించిన డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ (డీడీఆర్) ప్రాజెక్టు ముగింపు వేడుకల్లో భాగంగా ప్రాజెక్ట్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్, చారిత్రక పరిశోధకురాలు, గాయని సోమిశెట్టి సరళకు కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం, అవార్డు అందించేందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 25న న్యూఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల చేతులమీదుగా సరళ అవార్డు అందుకోనున్నారు.
‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర’ను జయప్రదం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 20 నుంచి నిర్వహించే ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌ను నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదట పారిశుధ్యం, గృహ నిర్మాణం, తాగునీరు, హరితాంధ్ర, వాట్సాప్ గవర్నెన్స్ తదితర 9 అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవలపై వచ్చే ప్రతి కూల వార్తలపై వెంటనే స్పందించాలన్నారు. వాస్తవలను పరిశీలించి వివరణ ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా పనులు సాగాలన్నారు. అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో మొక్కలు విరివిగా నాటాలని, అవి వంద శాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ఎద్దడి, సూర్యఘర్, గృహ నిర్మాణం, జలధార పనులను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, కమిషనర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఏఎస్ పోస్టుల భర్తీకి చర్యలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ) చైర్మన్, కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 16, సీఏఎస్ జనరల్ పోస్టులు 10 చొప్పున మొత్తం 26 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ఆసక్తి, తగిన అర్హత ఉన్న వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http:// ananthapuramu. ap. gov. in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.
సీబీఆర్ నుంచి 200 క్యూ సెక్కుల నీరు విడుదల
తాడిమర్రి: మండల సరిహద్దులోని పార్నపల్లి వద్ద నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి మంగళవారం సీబీఆర్ అధికారులు దిగువకు (చిత్రావతి నది) 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీబీఆర్ డీఈ చంద్ర సురేష్ జలాశయం 7 గేట్లలో ఒక దానిని 8 సెంటీమీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ సీబీఆర్ దిగువన ఉన్న చిత్రావతి నది, నదీ పరివాహక గ్రామాల్లో వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఏడాది 1.50 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేశామన్నారు. రోజూ 200 క్యూసెక్కుల ప్రకారం 30 రోజుల పాటు విడుదల చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సీబీఆర్ సిబ్బంది పాల్గొన్నారు.


