‘పల్లె’ వద్ద తహసీల్దార్‌ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

‘పల్లె’ వద్ద తహసీల్దార్‌ పంచాయితీ

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

సాక్షి, పుట్టపర్తి: ‘సార్‌.. మనకు పాత ఎమ్మార్వో గారే మేలు. చెప్పిన ప్రతి పని చేసే వారు. అలాంటి వ్యక్తికే మరోసారి బాధ్యతలు ఇప్పించండి. కొత్తగా వచ్చిన మేడం మనకు అనుకూలంగా పని చేసే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి డీటీగా ఉన్న స్వామికే మళ్లీ బాధ్యతలు ఇప్పించండి. మనకు అన్ని విధాలుగా పనులు జరుగుతాయి’ అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వద్ద ‘తెలుగు తమ్ముళ్లు’ పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. అయితే తనకు సంబంధం లేదని.. ఉన్నతాధికారుల నిర్ణయమే ఫైనల్‌ అని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. డీటీగా ఉన్న వారితోనే నచ్చిన పని చెప్పి చేయించుకుంటే సరిపోతుందని సర్దిజెప్పినట్లు సమాధానం. మరోవైపు కొత్త తహసీల్దార్‌ వద్దని.. పంపించేయాలని కొందరు పట్టుబట్టగా.. మాజీ మంత్రి పట్టించుకోలేదని తెలిసింది. మాజీ మంత్రి ఫిర్యాదుతోనే.. బాధ్యతల నుంచి తప్పించారని మరోవైపు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొత్తగా వచ్చిన అధికారి ఉంటారా? లేక పాత వాళ్లని తెస్తారా? ఇద్దరినీ తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పజెబుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

తెర వెనుక కుట్రలెన్నో..

కొత్తగా వచ్చిన అధికారిణి ఉన్నఫలంగా పుట్టపర్తికి నియమితులయ్యారు. అంతకుముందు కొత్తచెరువుకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు ఇచ్చి.. గంటల వ్యవధిలోనే పుట్టపర్తికి మార్చారు. ఈ నియామకాన్ని కూటమి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త అధికారి వచ్చిన రోజు నుంచి షాడో ఎమ్మెల్యేగా పేరుగాంచిన నాయకుడు మాజీ మంత్రి వద్ద పంచాయితీ పెట్టారట. ఎలాగైనా పంపించేయాలని కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ప్రొటోకాల్‌ కష్టం అవుతుందని.. తమకు అనుకూల పనులు చేయరని.. ఏవేవో ఫిర్యాదులు చేస్తున్నారు. పుట్టపర్తిలో ఇటీవల ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాక్టు ఎయిర్‌ క్రాఫ్ట్‌) ఏర్పాటుకు భూమిపూజ చేశారు. భూ సేకరణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అంతకుముందు ఉన్న అధికారితో కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఉన్నఫలంగా అధికారి మారడంతో దిక్కు తోచని స్థితిలో కొందరు టీడీపీ కార్యకర్తలు మహిళా అధికారిపై కుట్ర చేస్తున్నారని సమాచారం.

లెక్క లేనన్ని ఫిర్యాదులు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పుట్టపర్తి మండలం పెడపల్లిలో భూ తగాదాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు సిండికేటుగా మారి భూమి కబ్జా చేసి పెద్ద భవనాలు కూడా నిర్మించారు. ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అప్పటి అధికారి కొట్టిపారేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అధికార పార్టీ అండతో డ్వామా నర్సరీ ఆక్రమించాడు. కంచె వేసుకుని మామిడి, కొబ్బరి చెట్లు కూడా నాటించాడు. పెడపల్లిలో రస్తా పొరంబోకులో ఇల్లు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. అయితే కొత్తగా వచ్చిన అధికారి ఇలాంటి తప్పిదాలే చేస్తారా? లేక తమదైన శైలిలో విధులు నిర్వర్తిస్తారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించి

పుట్టపర్తి మండలంలో భూ సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. సంబంధిత అధికారి పట్టించుకునే వారు కాదు. సోమవారం రోజున కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తే.. అక్కడి నుంచి అడిగే ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చేవారని తెలిసింది. ఉన్నతాధికారులనే సైడ్‌ ట్రాక్‌ చేసి తప్పుడు ఫిర్యాదులని చెబుతూ పబ్బం గడిపినట్లు సమాచారం.

పంపించేందుకే పట్టుబట్టిన తమ్ముళ్లు

చెప్పిన పని చేసే అధికారిని మళ్లీ తెచ్చుకుందామని ఒత్తిళ్లు

ససేమిరా అంటున్న మాజీ మంత్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement