రైలు ఢీకొని తెగిన చేయి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని తెగిన చేయి

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

మద్యం సేవించి పట్టాలు

దాటుతుండగా ప్రమాదం

ధర్మవరం: మద్యం సేవించి పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి చేయి తెగి పడిన సంఘటన ధర్మవరంలో జరిగింది. హిందూపురం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఎర్రిస్వామి తెలిపిన వివరాల మేరకు... ఒడిశా రాష్ట్రం మల్కాజ్‌గిరి జిల్లా మస్తీపుట్‌ గ్రామానికి చెందిన శ్యాంసుందర్‌ కుమారుడు పొదుమ్‌ ధర్మవరం పట్టణం లక్ష్మీచెన్నకేశవపురం కాలనీకి వలస వచ్చాడు. సిమెంట్‌ కాంక్రీట్‌ పనులకు వెళుతూ జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి బయటకు వెళ్లి మద్యం సేవించాడు. అనంతరం లక్ష్మీచెన్నకేశవపురంలోని నివాసానికి వెళుతూ మార్గమధ్యంలోని పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొంది. ప్రమాదంలో అతని ఎడమ చేయి తెగిపోయింది. అయినా నివాసానికి వచ్చిన అతడిని తోటి కూలీలు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, మిల్లర్‌లో చేయి పెట్టడం వల్ల పొదుమ్‌ చేయి కట్‌ అయిందని ఆసుపత్రిలో రికార్డుల్లో రాయించడం గమనార్హం. రైలు పట్టాల వద్ద తెగిపడిన చేయిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారణ చేయగా, అసలు విషయం వెలుగుచూసింది. ఈ క్రమంలో పొదుమ్‌ చిన్నాన్న గోవర్ధన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ ఎర్రిస్వామి తెలిపారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

బత్తలపల్లి/ముదిగుబ్బ: మండల పరిధిలోని చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ధర్మవరం రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ షణ్ముఖరెడ్డి, ఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ పుల్లయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నేకుంటపల్లి వద్ద రైల్వే బ్రిడ్జికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (30 నుంచి 40 సంవత్సరాలు) సెవెన్‌హిల్స్‌ రైలు కింద పడి మృతి చెందినట్లు లోకో పైలట్‌ ద్వారా సమాచారం అందింది. ముఖం గుర్తు పట్టేందుకు కూడా వీల్లేనంతగా మారింది. వంగపూత రంగు లుంగీ ధరించాడని, శరీరం బలిష్టంగా ఉందని, సున్తీ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఎరుపు, నలుపు రంగుల చెప్పులు సంఘటనాస్థలంలో లభించాయి. వివరాలు తెలిస్తే 9440557054, 9951325345 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement