గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామానికి చెందిన మునగాల ప్రవల్లిక (27) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునగాల ఆదిశంకర్ భార్య మునగాల ప్రవల్లిక కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. గుత్తితో పాటు పలు ఆసుపత్రులతో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలను బయటకు పంపి తలుపులు మూసుకుని ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుంది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ప్రవల్లికను కిందకు దింపిన అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవల్లిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం
● దంపతులకు గాయాలు ● కణేకల్లు సమీపంలో ఘటన
కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంప తులు శోభ, తిప్పేస్వామి గాయపడ్డారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న తిప్పేస్వామి వచ్చే నెలలో జరగనున్న తన కుమార్తె చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కారులో మండలంలోని మాల్యం గ్రామానికి వచ్చాడు. పెళ్లి పత్రి కలు పంచి కారులో బళ్లారికి వెళ్తూ మార్గమధ్యంలోని ఆలూరు వద్ద పైప్‌లైన్ పనులు చేస్తున్న హైడ్రాలిక్ క్రేన్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. శోభ, తిప్పేస్వామికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కటకటాల్లోకి గంజాయిబ్యాచ్
తాడిపత్రిటౌన్: రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన కరీమ్, ప్రకాష్‌నాయుడు, అస్రాబ్, మరో ఇద్దరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
గాయపడిన శోభ, తిప్పేస్వామి


