‘కూటమి’ చేసింది గోరంత.. ప్రచారం కొండంత | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ చేసింది గోరంత.. ప్రచారం కొండంత

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

పుట్టపర్తి టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో ప్రజలకు గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడానికి విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌ విమర్శించారు. మంగళవారం పుట్టపర్తిలో సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారన్నారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు ఇవ్వలేదన్నారు. కార్పొరేట్‌ సంస్థల ద్వారా కమీషన్లు పొందడంపై చూపిస్తున్న శ్రద్ధ పేద ప్రజల సంక్షేమం చూపడం లేదన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయబద్ధంగా పరిహారం అందించాలని, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. చిలమత్తూరులో సర్వే నంబర్‌ 805లో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు భూ సేకరణ చేపట్టగా, అనివార్య కారణాలతో పట్టాల పంపిణీ ఆగిపోయిందన్నారు. అప్పట్లో టీడీపీ నాయకులు అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేడు రెండేళ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 వంటి పథకాలు అమలు చేయలేదన్నారు. ప్రజలను మరోసారి మోసం చేయడానికే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కమిటీ నాయకులు లక్ష్మినారాయణ, ఫిరంగి ప్రవీణ్‌, జీఎల్‌ నరశింహులు, దిల్షాద్‌, హరి, జెంగాలపల్లి పెద్దన్న, జెడ్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement