16 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

16 మండలాల్లో వర్షం

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

పుట్టపర్తి అర్బన్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 16 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 34.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక హిందూపురం మండలంలో 32.4 మి.మీ, లేపాక్షి 24.0, గుడిబండ 21.2, పరిగి 18.6, గోరంట్ల 18.4, సోమందేపల్లి 9.2, అమరాపురం 7.4, అగళి 5.6, రొళ్ల 5.4, కొత్తచెరువు 5.2, చిలమత్తూరు 4.4, బుక్కపట్నం 4.0, నల్లచెరువు 2.8, సీకేపల్లి 2.2, పుట్టపర్తి మండలంలో 2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హతమారుస్తామంటూ బెదిరించారు

– బీజేపీ నేత విష్ణు

అనంతపురం సిటీ: తనను హతమారుస్తామంటూ ఐదు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారని బీజేపీ నేత ఎస్‌.విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తనకు కాల్‌ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడారని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ వారు పట్టించుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.

ఆరోపణలు సరికాదు..

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీతో పాటు ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదని విష్ణు అన్నారు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాకు శ్మశానం లేకుండా చేశారయ్యా

కలెక్టర్‌కు మొరపెట్టుకున్న

బత్తలపల్లి గ్రామ దళితులు

ప్రశాంతి నిలయం: ‘‘మా తాత ముత్తాతల కాలం నుంచి గ్రామ సమీపంలోని ఓ స్థలాన్ని మేమంతా శ్మశానంగా వాడుకుంటున్నాం. మా తాతలు, తండ్రులను అక్కడే పూడ్చి వారికి గుర్తుగా సమాధులు కూడా కట్టుకున్నాం. కానీ వారం రోజుల క్రితం జగరాజుపల్లికి చెందిన మురళీధర్‌రెడ్డి జేసీబీతో 50 సమాధులను ధ్వంసం చేశారు. ఇది తన భూమి అని..దౌర్జన్యం చేశాడు. మాకు శ్మశానం లేకుండా చేశాడు’’ అని పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ను కలిసి అర్జీ అందించారు.

ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి: కలెక్టర్‌

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని పారదర్శకంగా విచారించి పరిష్కరించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జేసీతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 308 అర్జీలు అందగా...వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అంతకుముందు కలెక్టర్‌..కార్యాలయం బయటే ఉన్న వృద్ధుల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరించి..సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.

పనిచేయని

పీజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌

పుట్టపర్తి అర్బన్‌: ‘‘ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం... సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు చేరుకోలేని వారు అర్జీలను వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేస్తే చాలు సమస్య పరిష్కరిస్తాం’’ అంటూ ప్రభుత్వం డప్పులు కొడుతోంది. కానీ వాస్తవంలో మాత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) వెబ్‌సైట్‌ పని చేయడం లేదు. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే...ఓటీపీ వస్తోందని, ఆ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫిర్యాదు రిజిష్టర్‌ చేయడానికి వెళితే సైట్‌ ఓపెన్‌ కావడం లేదని పలువురు చెబుతన్నారు. సైట్‌ తిరిగి బ్యాక్‌కు వచ్చేస్తోందంటున్నారు. 1100కు కాల్‌ చేసినా ఉపయోగం లేదంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement