కదిరి: కదిరి పట్టణానికి రింగ్ రోడ్డు తరహాలో నిర్మిస్తున్న కదిరి బైపాస్ పనులు పూర్తయ్యే మార్గం కనిపించడలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పనులు 80 శాతం పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పనులు ‘మూడడుగులు ముందుకు..ఆరడుగులు వెనక్కు’ అన్న చందంగా సా..గుతున్నాయి. స్థానిక టీడీపీ ముఖ్యనేత స్వలాభం కోసం రాజకీయం చేస్తూ పట్టణ ప్రజలతో పాటు అక్కడ భూములు కోల్పోతున్న రైతులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికార పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కదిరి పట్టణానికి చుట్టూ 12 కి.మీ మేర కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎకరాకు రూ.17 లక్షల నుంచి రూ.30 లక్షల మేర ఇచ్చింది. రోడ్డు నిర్మాణ పనులు కూడా 80 శాతం పూర్తయ్యాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు విద్యుత్ హైటెన్షన్ టవర్లు మార్చేలోపు 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎప్పుడో రహదారి పనులు పూర్తి కావాల్సిన ఉండగా.. స్థానిక టీడీపీ ముఖ్య నేత జోక్యంతో ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు ఆ పార్టీకి సానుభూతిపరులైన కొందరు రైతుల భూముల్లో విద్యుత్ హైటెన్షన్ టవర్లు వేసి, భవిష్యత్‌లో ఆ పొలాల్లో వారు వ్యవసాయం చేయకుండా, లేదంటే ఆ భూములు అమ్ముడు పోకుండా చేయాలనేది ఆయన కుట్ర. దీన్ని పసిగట్టిన బాధిత రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కదిరిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘కదిరి నియోజకవర్గ ప్రజలు ఇక్కడ టీడీపీని ఓడించారు. అయినా సరే.. మీకు రింగ్‌రోడ్డు మంజూరు చేస్తున్నాను’ అని హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో స్థానిక టీడీపీ నాయకులు ‘కదిరికి బైపాస్ రోడ్డు మంజూరైందోచ్..’ అంటూ కేవలం అలైన్‌మెంట్ కాపీలను చూపి అప్పట్లో హడావుడి చేశారు. తర్వాత అధికారంలోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరికి బైపాస్‌రోడ్డు మంజూరు చేయడంతో పాటు కేంద్రం నుంచి రూ.234 కోట్ల నిధులు తెచ్చింది. ఆ డబ్బుతోనే ఇప్పటికీ బైపాస్ పనులు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ టీడీపీ నాయకులు బైపాస్ ఘనత తమదే.. అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే పనిలోనే ఉన్నారు. కేవలం రెండు విద్యుత్ హైటెన్షన్ టవర్లు మార్చాల్సిన చోట 10 టవర్లు మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వీటి కోసమే మరో రూ.16 కోట్లు తెచ్చారని, అందులో ఆయన వాటాగా 30 శాతం (రూ.4.80 కోట్లు) తీసుకున్నారని కూటమి నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
కొనసా..గుతున్న
కదిరి బైపాస్ పనులు
గత ప్రభుత్వంలోనే
80 శాతం పనులు పూర్తి
హైటెన్షన్ విద్యుత్ టవర్ల మార్పు
పేరుతో జాప్యం
కమీషన్ల కోసం రెండుకు బదులు
10 టవర్లు మార్చే యత్నం
రైతుల జోలికొస్తే మీకు కష్టాలే
మీ స్వార్థం కోసం రైతులను ఇబ్బంది పెట్టి, మీకు ఇష్టం వచ్చిన చోట టవర్‌లు వేస్తామంటే ఒప్పుకోము. అందుకే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం అర్థిస్తున్నాం.
– ఎ.మనోహర్, రైతు, కుటాగుళ్ల


