ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

ధరాఘాతం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

సామాన్యులకు
‘ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు.. నాగులో నాగన్న’ అన్న పాట వాస్తవ రూపం దాలుస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితం దుర్భరంగా మారింది. అన్ని విధాలా అండగా ఉంటామన్న చంద్రబాబు ప్రభుత్వం కూడా పేదల కష్టాలను పట్టించుకోకపోవడంతో వారి బతుకులు దిన దిన గండంగా మారాయి.

ధర్మవరం రూరల్‌: పెట్రోలు మొదలు నిత్యావసరాల దాకా... టీ మొదలు భోజనం దాకా ప్రతి దానిపై రేట్లు రెట్టింపయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. ఒకటి రెండు హామీలతోనే సూపర్‌–6 విజయవంతమైనట్లు ప్రచారం చేసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. సంక్షేమ పథకాల లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పడిపోయింది. నెలల వ్యవధిలోనే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ధరల నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు.

ప్రతి నెలా అప్పులతోనే...

ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. చిరుద్యోగుల వేతనాలు రూ.15 వేల లోపే ఉండటం, ధరలు అడ్డగోలుగా పెరుగుతుండడంతో ఖర్చులను తట్టుకోలేక అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఓ సామాన్య కుటుంబం బతకాలంటే నెల ఖర్చు సుమారు రూ. 25 వేల నుంచి రూ.30 వేల దాకా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అండగా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసింది. ప్రతి కుటుంబానికి సగటున మూడు, నాలుగు పథకాల కింద రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా ప్రయోజనం దక్కింది. దీంతో అప్పట్లో కొనుగోలు సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్‌ను విడుదల చేసి వాటి ప్రకారం పథకాలను అమలు చేయడంతో కిరాణా వ్యాపారాలు కూడా బాగా జరిగేవి. ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల చేతిలో చిల్లిగవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రయ విక్రయాలు లేక చిన్న కిరాణా దుకాణాలను మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అబద్ధాలు చెప్పి...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్నాయంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమంతో ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే నిత్యావసర సరుకులు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చినా ధరలు తగ్గించకపోగా బాదుడే.. బాదుడంటూ అన్ని రేట్లను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement