సర్‌.. మీ ఓటు భద్రం! | - | Sakshi
Sakshi News home page

సర్‌.. మీ ఓటు భద్రం!

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

కదిరి: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై అందరిలోనూ ఆందోళన నెలకొంది. సర్వేలో భాగంగా బీఎల్‌ఓ ఇచ్చే ఎన్యుమరేషన్‌ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లుగా భారతదేశంలోనే ఉన్నట్లు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల ఓట్లను టార్గెట్‌ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ‘సర్‌’హాట్‌ టాపిక్‌గా మారింది. ‘సర్‌’ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ దగ్గర నుంచి కింది స్థాయి వరకు అధికారులందరూ చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం పలు అనుమానాలు నెలకొన్నాయి.

2002 తర్వాత మళ్లీ ఇప్పుడు...

జిల్లాలోని హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం మినహా మిగిలిన కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, హిందూపురం..ఇలా 6 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14.23 లక్షల ఓట్లు ఉన్నాయి. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్‌’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్‌ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకూ బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు.

ఫాం–2లో ఏమి నింపాలి..

‘సర్‌’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్‌ ఫాం–2 నింపి, బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరుంటే.. ఆ వివరాలు ఎన్యూమరేషన్‌ ఫాంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే..మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతరత్రా కుటుంబీకుల పేర్లు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లిపేరు, భార్య/భర్త పేరు, వారి ఎపిక్‌ నంబర్‌(అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించి బీఎల్‌ఓకు అందజేస్తే ఇందుకు రసీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరచుకోవాలి.

బూత్‌ లెవెల్‌ ఏజెంట్లదే కీలక పాత్ర..

బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్న సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) దగ్గరుండి ఓటర్లకు తమ సహాయ, సహకారం అందించాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యర్థి పార్టీదే పైచేయి అవుతుంది. ఎన్నికల సమయంలో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు లేవని ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు.

జాగ్రత్తగా లేకపోతే

ఓటు కోల్పోయే ప్రమాదం

24 ఏళ్ల తర్వాత ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌

రివిజన్‌’ ప్రక్రియ

రేపటి నుంచి ఇంటింటికీ

బూత్‌ స్థాయి అధికారులు

2002 ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల పరిశీలన

‘సర్‌’లో ముఖ్యమైన తేదీలు

జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అలాగే జూలై 14 నాటికి పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ పూర్తి చేస్తారు.

జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు.

జూలై 21 నుంచి సెప్టెంబర్‌ 18వ తేదీ వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు.

సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement