వర్షం.. బీభత్సం | - | Sakshi
Sakshi News home page

వర్షం.. బీభత్సం

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

మడకశిర: నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. మడకశిర సమీపంలోని పెద్దవంక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ మృత్యువాతపడింది. మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని బేగార్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణప్ప కుమార్తె గీతమ్మ(40)ను కొన్నేళ్ల క్రితం కర్ణాటకలోని కొరటగెర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. రెండురోజుల క్రితం పుట్టినిల్లు బేగార్లపల్లికి వచ్చిన గీతమ్మకు ఆరోగ్యం బాగాలేక పోవడంతో శుక్రవారం రాత్రి వేళ తన తమ్ముడు దివాకర్‌తో కలిసి ద్విచక్రవాహనంలో మడకశిరకు వెళ్లి చికిత్స చేయించుకుంది. అనంతరం బేగార్లపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే రాత్రి 10 గంటలు కాగా, వర్షం భారీగా కురుస్తోంది. వీరి వాహనం బేగార్లపల్లికి సమీపంలోకి పెద్దవంక వద్దకు రాగా, వర్షపు నీరు కల్వర్టుగా పొంగి ప్రవహిస్తోంది. చిమ్మచీకటిలో నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేని దివాకర్‌ వాహనాన్ని వంకపై ఉన్న కల్వర్టును దాటించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా మధ్యలోకి రాగానే నీటి ఉధృతికి బైక్‌ అదుపుతప్పి అక్కాతమ్ముడు నీటిలో పడిపోయారు. దివాకర్‌ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడగా..గీతమ్మ నీటిలో కొట్టుకు పోయింది. వెంటనే దివాకర్‌ గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులకు ఘటనకు గురించి తెలిపాడు. దీంతో వారు పోలీసులు,విపత్తలు శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి... వంకవద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా గాలించినా గీతమ్మ ఆచూకీ తెలియలేదు. మళ్లీ శనివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా.. బేగార్లపల్లి క్రాస్‌లోని ప్రధాన రహదారికి ఏర్పాటు చేసిన కల్వర్టు కింద గీతమ్మ మృతదేహం కనపించడంతో బయటకు తీసి.. పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గీతమ్మ మృతితో పుట్టిళ్లు బేగార్లపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు గీతమ్మ మృతదేహంపై పడి బోరున విలపించారు. తల్లిని తీసుకువెళ్లి ముగ్గురు పిల్లలకు అన్యాయం చేశావు దేవుడా...అంటూ వారు రోదించిన తీరు చూసి అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

కొట్టుకుపోయిన బొలెరో వాహనం..

మడకశిర మండలంలోని ఆర్‌,అనంతపురం గ్రామానికి చెందిన శ్రీనాథ్‌, మదన్‌మోహన్‌, జస్వంత్‌కుమార్‌ బొలెరో వాహనంలో శుక్రవారం కర్ణాటకలోని మధుగిరికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని రాత్రి మడకశిరకు బయలుదేరారు. అప్పటికే మడకశిరలో భారీ వర్షం కురిసి పెద్దవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతిని గమనించిన వీరు బొలెరో వాహనంలో కల్వర్టుపైనుంచి పట్టణంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. మధ్యలోకి రాగానే నీటి ఉధృతికి వాహనం అదుపుతప్పింది. దీంతో వాహనంలో ఉన్న ముగ్గురూ నీటిలో కొట్టుకుపోయారు. స్పందించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, విపత్తు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముగ్గురినీ రక్షించారు.

19 మండలాల్లో వర్షం

పుట్టపర్తి అర్బన్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకూ 19 మండలాల పరిధిలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిరలో 74.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే రొళ్ల మండలంలో 57.4 మి.మీ, రొద్దం మండలంలో 53.6 మి.మీ, లేపాక్షి 53.2 మి.మీ, సోమందేపల్లి 52.2 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షం కురిసిందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

పొంగిపొర్లిన వాగులు, వంకలు

మడకశిర పెద్దవంకలో

కొట్టుకుపోయి మహిళ మృతి

బేగార్లపల్లిలో అలుముకున్న విషాదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement