చేనేతల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

చేనేతల పోరుబాట

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

ధర్మవరం: తమ సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కార్‌పై చేనేతలు పోరుబాట పట్టారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 22వ తేదీన కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. శనివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ, జిల్లా కన్వీనర్‌ జేవీ రమణ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమీర్‌ బాషా, వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం నాయకుడు గడ్డం రంగ, కాంగ్రెస్‌ నాయకుడు తుంపర్తి పరమేష్‌, సీపీఐ నాయకుడు రవికుమార్‌, ఏఐటీయూసీ నేత రమణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మాట్లాడారు. చేనేతలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ‘నేతన్న భరోసా’ కింద ఏటా రూ.25 వేలు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వం చేనేతకు విధిస్తున్న జీఎస్‌టీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు పింఛను ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. అంతేకాకుండా ముడిపట్టు ధరలను కూడా నియంత్రించడం లేదన్నారు. ఫలితంగా చేనేతలు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే 22న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు వెంకటస్వామి, విజయభాస్కర్‌, ఎస్‌హెచ్‌ బాషా, చెన్నంపల్లి శ్రీనివాసులు, ఖాదర్‌ బాషా, హరి, నారాయణస్వామి, నాగరాజు, లోకేష్‌ పాల్గొన్నారు.

న్యాయమైన డిమాండ్ల సాధనకు

22న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement