ఓడీచెరువు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల ఆగడాలకు అడ్డ్డూఅదుపు లేకుండా పోయింది. దందాలు, దౌర్జన్యాలు చేస్తూ తమకు అడ్డేలేదని విర్రవీగుతున్నారు. సామాన్యులపై జులుం ప్రదర్శిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఉపాధి పనులకూ రాజకీయ రంగు పూశారు. వైఎస్సార్ సీపీ ముద్రవేసి పేదలు పనులు చేయకుండా అడ్డుకుంటూ వారి పొట్టగొడుతున్నారు.
ఫొటోలు కూడా తీయొద్దు..
మండలంలోని మల్లాపల్లిలో నిరుపేదలు కొన్నిరోజులుగా ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజకీయ వైరంతో వారిపై కక్షగట్టిన స్థానిక టీడీపీ నాయకులు మూడు రోజులుగా వారిని పనులు చేయనీయడం లేదు. ‘‘మీరు వైఎస్సార్ సీపీ వాళ్లు...మా ప్రభుత్వంలో మీరు పనులు చేసినా బిల్లులు రావు...వెళ్లిపోండి’’ అంటూ తమను వేధిస్తున్నారని మల్లాపల్లికి చెందిన కూలీలు హారున్ బాషా, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్ నాయక్, ఫక్కీర్ నాయక్, ప్రసాద్, ఓబుళరెడ్డి, మున్ని, శాంతమ్మ, సలీమా, రవీంద్ర రెడ్డి, చంద్రనాయక్ శనివారం విలేకరులతో వాపోయారు. వైఎస్సార్ సీపీ వాళ్ల ఫొటోలు తీయొద్దు...తీసినా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారన్నారు. కరువు పనులు చేసుకుని బతికే తమపై కక్షగట్టి రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరారు.
కూలీలకు వైఎస్సార్ సీపీ
ముద్ర వేసిన ‘పచ్చ’గ్యాంగ్
మూడు రోజులుగా
పనులకు అడ్డంకులు


