‘అల్లనేరేడు’.. అన్నదాత దిగాలు | - | Sakshi
Sakshi News home page

‘అల్లనేరేడు’.. అన్నదాత దిగాలు

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

తనకల్లు: అల్లనేరేడు పండ్లను సాగు చేసిన రైతులకు నష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రైతులు దిగాలు చెందుతున్నారు. అల్ల నేరేడు దిగుబడి బాగున్నా ధరలు తగ్గిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులున్నారు. వగరుగా, తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉండే అల్ల నేరేడు పండు అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. రుచి గొప్పగా ఉండడంతో పాటు నేరేడు పండులో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఎన్నో పోషకాలకు నెలవుగా, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న నేరేడు పళ్లను చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు తినేందుకు ఇష్టపడుతారు.

పోషకాలు మెండు

ఎన్నో పోషక ప్రయోజనాలు ఉన్న నేరేడును చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా రుచి చూస్తుంటారు. మధుమేహం, రక్తహీనత, బీపీ, కిడ్నీ సమస్యలతో పాటు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యే వారికి నేరేడు పండ్లు రోగ నివారణగా పనిచేస్తాయి. పొట్టలో ఉండే నులిపురుగులను నేరేడు నివారిస్తుందని వైద్యులంటున్నారు. నోటి క్యాన్సర్‌ నివారణకు నేరేడు పండ్లు ఎంతగానో దోహదపడుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు ఒక వరం లాంటిది. గింజలను పొడి చేసుకొని రోజూ వాటిని నీటిలో మరగబెట్టి వడగట్టి తాగితే శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. అతిసార రోగులకు సైతం ఈ పండ్లు ఔషధంగా పనిచేస్తాయి. మూత్రాశయ సమస్యలకు నేరేడు ఓ టానిక్‌లా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడేవారికి ఉపయోగపడుతుంది. ఈ పండ్లలో విటమిన్‌ బి, సీ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో వీటిని సర్వరోగ నివారణిగా భావిస్తారు. ఈ పండ్లను ఆయుర్వేదంలో అపర సంజీవినిగా చెబుతారు. దీంతో నేరేడు పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

ఆందోళనలో రైతులు..

జిల్లా వ్యాప్తంగా 1,500 ఎకరాలకు పైగానే అల్లనేరేడు సాగులో ఉంది. మామిడి తోటలలోనూ, విడిగానూ అల్ల నేరేడు తోటలను రైతులు సాగు చేశారు. ఇక్కడ పండిన అల్లనేరేడును ఎక్కువగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, పుంగనూరు, మొలకలచెరువు, కర్ణాటకలోని చింతామణి, బెంగళూరు, కోలారు తదితర మార్కెట్లకు తరలించి విక్రయిస్తారు. గత పది రోజుల క్రితం అక్కడి మార్కెట్లో కిలో నేరేడు రూ. 150 నుంచి రూ. 200 వరకు అమ్ముడుపోయాని రైతులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 40, రూ. 50 మాత్రమే పలుకుతున్నాయని రైతులు వాపోతున్నారు. రూ. లక్షలు పెట్టి తోటలను కొనుగోలు చేశామని, వేలాది రూపాయిలు మందుల కోసం ఖర్చు చేసి పంటను కాపాడుకున్నామన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరలు కూలీలకు, రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి బాగా వచ్చిందని, అయితే ధరలు పతనమవడంతో పంటకు చేసిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడం లేదంటున్నారు. నేరేడు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

మార్కెట్లో పడిపోయిన ధరలు

కిలో రూ. 50 లోపే పలుకుతున్న వైనం

దిగుబడి బాగున్నా

లాభాలు లేవంటున్న రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement