తొలిరోజే తడ‘బడి’ | - | Sakshi
Sakshi News home page

తొలిరోజే తడ‘బడి’

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

పుట్టపర్తి: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ప్రకటించిన ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సాదాసీదాగా జరిగింది. స్వాగత తోరణాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల హాజరు వంటివి అనేక పాఠశాలల్లో కనిపించలేదు. ఫలితంగా పండుగ వాతావరణం నెలకొనాల్సిన చోట నిరుత్సాహకర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కొత్త బ్యాగులు, యూనిఫాం, బెల్టులు, షూ–సాక్సులు, నోట్‌బుక్కులు అందుతాయన్న ఆశతో తొలిరోజు శుక్రవారం బడులకు వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ‘డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు’ ఏ ఒక్క పాఠశాలలోనూ పంపిణీ కాలేదు. జిల్లాలో 1,22,836 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు. తొలిరోజే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, చాలా పాఠశాలల్లో పంపిణీ పూర్తి కాలేదు. నూతన యూనిఫాం, స్కూల్‌ బ్యాగులు ఇవ్వకపోవడంతో పాత దుస్తులు, బ్యాగులతోనే బడికి వచ్చారు. ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇక మనబడి నాడు–నేడు రెండో విడత పనులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. భవనాల మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలకాల్సిన పాఠశాలలు కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులను ఆహ్వానించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

బడులకొచ్చిన చిన్నారులకు నిరాశ

కిట్లు, బ్యాగులు, యూనిఫాం లేక అవస్థ

జిల్లాలో సాదాసీదాగా

‘మనబడి–మన పండుగ’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement