సీకేపల్లి తహసీల్దార్‌ స్వామిభక్తి | - | Sakshi
Sakshi News home page

సీకేపల్లి తహసీల్దార్‌ స్వామిభక్తి

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): ఎన్నికల నిబంధనలన్నీ పాటించేలా చూడాల్సిన తహసీల్దారే వాటిని ఉల్లంఘించారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతల వద్ద స్వామిభక్తిని చాటుకున్నారు.

వేదిక పంచుకుని...

ప్రత్యేక ఓటరు నమోదు (సర్‌) కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నేకొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో బీఎల్‌ఓలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బీఎల్‌ఏల ఇన్‌చార్జ్‌ ఫణికుమార్‌తో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులను తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ వేదికపైకి ఆహ్వానించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇందుకు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు అభ్యంతరం తెలిపారు. నిబంధనలు ప్రకారం ఇటువంటి సమావేశాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా అందరిని సమానంగా చూడాలన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన తహసీల్దార్‌ తీరుకు వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలు నిరసన తెలియజేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తహసీల్దార్‌తో పాటు టీడీపీ నాయకులు దీనిని పట్టించుకోకుండా వ్యవహరించటంతో వారంతా సమావేశాన్ని బహిష్కరించారు. ఈ ఘటనపై స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితో పాటు సీఈఓకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు చింతా మధుసూదన్‌, మల్లెల నరసింహులు, కర్ర కిష్టప్ప తెలిపారు.

ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే

నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత తహసీల్దార్‌పై ఉంటుంది. కానీ ఆయనే ఓ రాజకీయ పార్టీ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వేదికపై కుర్చోబెట్టుకొని బీఎల్‌ఏల సమావేశం నిర్వహించటం ముమ్మాటికీ నిబంధనలు ఉల్లంఘించడమే. ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి. సమావేశాల్లోనే అధికారులు ఇలా వ్యవహరిస్తే ఓటరు నమోదు ప్రక్రియలో ఇంకెంత దారుణంగా వ్యవహరిస్తారోననే అనుమానం ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

– అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ

నియోజకవర్గ బీఎల్‌ఏల ఇన్‌చార్జ్‌

బీఎల్‌ఏల సమావేశంలో

టీడీపీ నాయకులకు ప్రాధాన్యం

ఏకంగా వేదికపై తన పక్కనే

కూర్చోబెట్టుకున్న వైనం

నిరసనగా సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు

Advertisement
 
Advertisement
Advertisement