బత్తలపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పరితపించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్‌కు పలువురు ఘన నివాళులర్పించారు. ఫాదర్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని గురువారం బత్తలపల్లిలోని ఫీల్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, స్పెయిన్ దేశస్తులు సంజీవ్ సంఘ్వాన్, యమున దంపతులు హాజరయ్యారు. ముందుగా ఫాదర్ ఫెర్రర్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా అన్నే ఫెర్రర్ మాట్లాడారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్దరణతో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ కోసం జిల్లా వాసులు సాగించిన పోరాటాలను కొనియాడారు. 57 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చివరకు రెన్యూవల్ పునరుద్దరించిందన్నారు. కష్ట సమయంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శుక్రవారం అన్నే ఫెర్రర్ పుట్టిన రోజు కావడంతో ముందస్తుగానే ఆమెకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. రాత్రి 9 గంటలకు మారుతీ నాట్యమండలి ఆధ్వర్యంలో పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్డీ హనుమంతప్ప, మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్లు పాల్, అక్బర్, మనోరంజన్, దశరథరామయ్య, హరి, శర్మ, రీజనల్ ఇంజనీర్ మధుసూదన్, ఆసుపత్రి ఇన్‌చార్జ్ హనుమంతరెడ్డి, సీబీఆర్ సెంటర్ మేనేజర్ రామకృష్ణ, సీబీఆర్ ఎస్టీఎల్ అంకాల్‌కుమార్, సోషల్ వర్కర్ లక్ష్మణ్, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు.


