తలసేమియా కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తలసేమియా కేంద్రం ప్రారంభం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

అనంతపురం: నగరంలోని పాతూరులో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెడ్‌క్రాస్‌ తలసేమియా డే కేర్‌ సెంటర్‌ను డీఆర్వో మలోల గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఈ.రామారావు, రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ రామచంద్ర రాజు, అనంతపురం జిల్లా చైర్మన్‌ కాపు భారతి, జిల్లా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ తలసేమియా కేంద్రానికి ఆర్థిక, వస్తు సాయం చేసిన దాతలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన తలసేమియా బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రక్తదాన శిబిర నిర్వాహకులు, వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, విద్యార్థులు, సమాజ సేవకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ.రామారావు మాట్లాడుతూ... తలసేమియా బాధిత చిన్నారులకు సేవ చేయడమనేది అతిపెద్ద మానసిక ప్రశాంతత కలిగించే కార్యక్రమమన్నారు. రెడ్‌క్రాస్‌ కాకినాడ తలసేమియా కేంద్రంలో రక్త మార్పిడి చేసుకుంటున్న పిల్లల్లో కొందరు ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నారని గుర్తు చేశారు. రామచంద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ తరపున త్వరలో ఇంపోర్టెడ్‌ లింబ్స్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తలసేమియా కేంద్రం చాలా బాధ్యతతో కూడుకున్న కార్యక్రమమని జిల్లాలో ప్రముఖ పిల్లల డాక్టర్లు శ్రీనివాసులు, రఘువంశీ వంటి వారు ఈ కేంద్రంలో సేవా చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ పరిణామం అని కొనియాడారు. డీఆర్వో మలోల మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్‌ సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జన్యు సంబంధిత తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రెడ్‌క్రాస్‌ రక్త మార్పిడి, మందులు, ఇతరత్రాలను పూర్తి ఉచితంగా అందించేలా ప్రణాళిక చేయటం చాలా సంతోషకరమన్నారు.

యూపీఎస్‌సీ ఫ్లాగ్‌ షిప్‌ పరీక్ష రేపు

అనంతపురం అర్బన్‌: ఈ నెల 12న జిల్లాలోని రెండు కేంద్రాల్లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగే ప్లాగ్‌ షిప్‌ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ, సీడీఎ) పరీక్షలకు 522 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సూచించారు. పరీక్షల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల కేంద్రంలో కంబైన్డ్‌ డిఫెన్స్‌ అకాడమీ–1 (సీడీఎ) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్‌ డిఫెన్స్‌ ఆకాడమీ (ఎన్‌డీఏ), నావెల్‌ అకాడమీ–1(ఎన్‌ఏ) పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఇన్‌స్పెక్టింగ్‌ అధికారులుగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు టి.పద్మావతి, రామ్మోహన్‌, రూట్‌ అధికారులుగా డ్వామా పీడీ సలీమ్‌బాషా, మైనార్టీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నపత్రాలకు కస్టోడియన్‌గా డీఆర్వో మలోల ఉంటారన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ధేశించిన పరీక్ష సమయానికి కంటే గంట ముందే చేరుకోవాలని, అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.

మద్యం తాగి వ్యక్తి మృతి

అనంతపురం సెంట్రల్‌: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురంలోని శారదానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను ఉమానగర్‌కు చెందిన ఆదిశేషయ్య(45)గా వన్‌టౌన్‌ పోలీసులు గుర్తించారు. కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆదిశేషయ్య గురువారం శారదనగర్‌లోని ఓ మద్యం షాపులో పూటుగా మద్యం తాగాడు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద మత్తులో పడిపోయాడు. అపస్మారక స్థితిలోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికుల సమాచారంతో వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement