చిత్రావతిలో ఇసుక దోపిడీ | - | Sakshi
Sakshi News home page

చిత్రావతిలో ఇసుక దోపిడీ

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

ముదిగుబ్బ: సహజ వనరుల దోపిడీని ఆదాయ వనరుగా మార్చుకున్న కూటమి నాయకులు చిత్రావతిని తూర్పారబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు భారీగా తగ్గి సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

ప్రజాప్రతినిధే ఇసుకాసురుడు!

చిత్రావతి నది ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు ప్రవహిస్తుంది. గతంలో ముదిగుబ్బ మండలంలో పీసీరేవు, తాడిమర్రి మండలంలో చిత్రావతి సమీపంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. కానీ ఓ ప్రజాప్రతినిధి ఉప్పలపాడు సమీపంలో భారీ యంత్రాలను ఉపయోగించి చిత్రావతిని ఇష్టానుసారం తవ్వేస్తున్నాడు. టిప్పర్ల ద్వారా సమీప పట్టణాలతో పాటు బెంగళూరుకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ దందా గురించి తెలిసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ప్రజలు అధికారుల తీరును తప్పుపడుతున్నారు.

అక్రమానికి ‘ఉమ్మడి ఒప్పందం’

కూటమిలోని టీడీపీ, బీజేపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు ఓ ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం పంపకాలు చేసుకొని ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే కూటమి నేతలు ధనదాహంతో చిత్రావతి నుంచి ఇష్టానుసారం ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని నది సమీప ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి చిత్రావతి నది నుంచే ముదిగుబ్బ మండలంలోని పలు గ్రామాలతో పాటు కదిరి ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో చిత్రావతి ఎండిపోయి నీరు సరఫరా చేయలేకపోతే వేలాది మంది తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

నిబంధనలు భేఖాతరు

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా నిరంతరం తవ్వకాలు జరిపి వాల్టా చట్టానికి తూట్టు పొడుస్తున్నారు. నదిలో పరిమితికి మించి తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు

కూటమి నాయకుల కనుసన్నల్లోనే అక్రమ దందా

భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ప్రజల ఆవేదన

నిఘా ఉంచుతాం

చిత్రావతి నుంచి ఇసుక అక్రమ తరలింపు విషయం మా దృష్టికి రాలేదు. ఇసుక తరలింపుపై సమాచారం వస్తే దాడులను నిర్వహించి చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా చిత్రావతి నది నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– అమీర్‌ బాషా, మైనింగ్‌ ఏడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement