పులి మాస్క్‌ ధరించి చోరీ | - | Sakshi
Sakshi News home page

పులి మాస్క్‌ ధరించి చోరీ

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

పామిడి: అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఓ కళ అని నిరూపించాడు ఓ దొంగ. పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఏకంగా పులి మాస్క్‌ ధరించి దుకాణంలో చొరబడి నగదుతో పాటు విలువైన వస్తువులను అపహరించుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే... పామిడిలోని మెయిన్‌ బజార్‌లో రఫీ అనే వ్యక్తి జీఎస్‌ఆర్‌ పేరుతో జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. గత 15 రోజులుగా దుకాణంలోని వస్తువులు, నగదు మాయమవుతుండడాన్ని గమనించిన ఆయన ఇటీవల సీసీ కెమెరాలను అమర్చాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాత్రి మరోసారి చోరీ జరిగింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన దుకాణదారుడు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి అవాక్కయ్యాడు. పాతికేళ్ల లోపు వయసున్న యువకుడు రెయిన్‌కోట్‌ ధరించి, ముఖానికి పులి మాస్క్‌తో దుకాణంలో తిరుగాడుతూ విలువైన సరుకులు, నగదు అపహరించడాన్ని గమనించి విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ శివశంకరనాయక్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఉత్సాహంగా దున్నపోతుల రాతిదూలం పోటీలు

కణేకల్లు: చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌ మైదానంలో గురువారం దున్నపోతుల రాతి దూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలకు మొత్తం ఏడు జతల దున్నపోతులను రైతులు తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంకాలం వరకూ సాగిన ఈ పోటీల్లో రైతు దాదాకు చెందిన దున్నపోతులు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే రైతు కురబ నాగరాజు దున్నపోతులు ద్వితీయ స్థానం, రైతు లాలుస్వామి దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నపోతుల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ చంద్రమౌళి, జూనియర్‌ అసిస్టెంట్‌ మారుతి, మాజీ వైస్‌ సర్పంచ్‌ ఆనంద్‌, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

అప్పు చెల్లించలేదని దాడి

పెనుకొండ రూరల్‌:అప్పు చెల్లించలేదంటూ ఓ వ్యక్తిపై వడ్డీ వ్యాపారులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం గుట్టూరుకు చెందిన ముక్తియార్‌ ధర్మవరానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో గురువారం ధర్మవరం నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు.. ముక్తియార్‌ కుటుంబసభ్యులు గౌస్‌బాషా, శర్మష్‌, జుబేర్‌, ఇమ్రాన్‌పై దాడి చేశారు. ఘటనలో గౌస్‌బాషా, శర్మాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కియా ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు : కలెక్టర్‌

ప్రశాంతి నిలయం: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుతో పాటు అబివృద్ధి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. ఇదే అంశంపై గురువారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 6 ప్రాధాన్యత పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌ ఆస్తులను సంరక్షిస్తూనే ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement