అందని సహకారం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకారశాఖలో తమకు సహకారం అందకుండా పోతోందని ఆ శాఖలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు పదోన్నతులు దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ఆరుగురు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార శాఖలో గత 30 ఏళ్లుగా వాచ్‌మెన్లుగా, అటెండర్లుగా పనిచేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ వీరు ఆ హోదాలోనే కొనసాగుతున్నారు. ఈ ఆరుగురికీ పదోన్నతులు దక్కాల్సి ఉన్నా... జాబితా తయారీలో ఉన్నతాధికారులు అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 31 లోపు పదోన్నతుల జాబితా సమర్పించాలని కలెక్టర్ జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలను సైతం సహకార శాఖ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడంతో నాల్గో తరగతి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పదోన్నతులకు అర్హత ఉన్నా తమను పట్టించుకోకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన 12 ఉమ్మడి జిల్లాల పరిధుల్లో పదోన్నతులు ఇప్పటికే పూర్తయినా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీస చలనం కూడా లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్‌కు అవగాహన లేకపోవడం, రోస్టర్ తయారీలో కాలయాపన చేయడంతో తమకు పదోన్నతులు పగటి కలగానే మిగిలిపోనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై కలెక్టర్, డీసీఓ తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని సదరు ఉద్యోగులు కోరుతున్నారు.
సహకార శాఖలో ఏళ్లుగా
పదోన్నతుల పెండింగ్
ఉన్నతాధికారులు సహకరించడం
లేదంటున్న నాల్గో తరగతి ఉద్యోగులు


