అవిసె సాగు.. వక్క బాగు
పెనుకొండ (సోమందేపల్లి): సోమందేపల్లి మండలం జూలుకుంట గ్రామానికి చెందిన రైతు రఘునాథరెడ్డి నూతన ఆలోచన విధానం పలువురు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వక్క తోటలో అవిసెను అంతర పంటగా పెట్టడం ద్వారా తక్కువ విస్తీర్ణంలోనే రెండు విభిన్న సిరుల పంటలను ఏక కాలంలో సాగులోకి తీసుకువచ్చారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని..
హిందూపురం ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న పనిచేస్తున్న రఘునాథరెడ్డి కుటుంబం గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. సంప్రదాయ పంటల సాగులో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి కావడంతో ఉద్యోగానికి ఆటంకమవుతుందని భావించిన ఆయన పలు రకాల పంటల సాగుపై అధ్యయనం చేపట్టాడు. ఈ క్రమంలో భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఒక్కసారి నాటితే వందేళ్ల దిగుబడినిచ్చే వక్క సాగుపై దృస్టి సారించాడు. దీంతో ఏడాది క్రితం రొళ్ల మండలం నుంచి 1,200 వక్క మొక్కలను సేకరించుకున్ని తనకున్న పొలంలోని రెండు ఎకరాల్లో నాటాడు. డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తున్నాడు.
రక్షణగా అవిసె చెట్ల పెంపకం..
త్వరలో వేసవి సీజన్ ప్రారంభం కానుండడంతో వక్క మొక్కల సంరక్షణకు వాటి చుట్టూ అవిసె మొక్కల పెంపకాన్ని రఘునాథరెడ్డి చేపట్టాడు. దాదాపు నాలుగు వేల అవిసె మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. ప్రస్తుతం అవిసె మొక్కలు బలంగా ఎదిగాయి. వక్క మొక్కలను చుట్టేసి ఎండ తీవ్రత పడనీయకుండా కాపాడుతున్నాయి. అవిసె ఆకులను పచ్చిరొట్ట ఎరువుగా వినియోగిస్తున్నాడు. దీంతో నేలకు అవసరమచైన నత్రజని, పుష్కలంగా అందుతోంది. ఇది వక్క మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతోంది. తొలుత అవిసె మొక్కలను రక్షణ పంటగా వేసినా... అవి కాస్త ఏపుగా పెరగడంతో అంతర పంటగా రూపాంతరం చెందింది. అవిసె ఆకులు, గింజలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో ఈ పంట దిగుబడికి మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుందని రైతు రఘునాథరెడ్డి అంటున్నాడు. అంతే కాక రెండేళ్ల అనంతరం ఏపుగా పెరిగే అవిసె చెట్ల ఆకుల ద్వారా పొట్టేళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని భావించిన ఆయన ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మరో 2 ఎకరాల్లో వక్క సాగుకు ప్రణాళిక..
ఇప్పటికే రెండు ఎకరాల్లో వక్క మొక్కలు నాటిన రఘునాథరెడ్డి... ఆ పొలానికి ఆనుకుని ఉన్న మరో రెండు ఎకరాల్లోనూ వక్క సాగుకు సిద్ధమవుతున్నాడు. దీంతో ఆ భూమిని చదును చేయించి, మొక్కల నాటేందుకు అనువుగా గుంతలు తీయిస్తున్నాడు. త్వరలో మరో 1,200 వక్క, దాని చుట్టూ మరో 4 వేల అవిసె మొక్కలు నాటే కార్యాచరణతో ముందుకు సాగుతున్నాడు.
పెరుగుతున్న వక్క సాగు..
రైతు రఘునాథరెడ్డి సాగు విధానాలను గమనించిన పలువురు రైతులు ఆ దిశగా తాము కూడా వక్క సాగుపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెనుకొండ నియోజకవర్గంలో వక్క సాగు విస్తీర్ణం క్రమేణ పెరుగుతోంది. ఇప్పటికే సోమందేపల్లి మండలం జూలుకుంట, ఈదుల బళాపురం, మండ్లి, చల్లాపల్లి, పరిగి మండలం పైడేటి, తుంగోడు, చలివెందుల, రాసిపల్లి, కొండూరు, ఇస్లాపురం తదితర గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున వక్క సాగు చేపట్టారు.
వక్క తోటల్లో అవిసె పంటను
అంతర పంటగా వేసి ఓ రైతు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది.
అవిసెతో పాటు వక్క మొక్కలూ ఏపుగా పెరుగుతున్నాయి. ప్రధానంగా నేల సారం పెరగడం, వక్క
మొక్కలకు నీడను అందించడంతో పాటు అదనపు ఆదాయానికి
అవిసె ఉపయోగపడుతుంది.
కొద్ది పాటి భూమిలోనే
సిరుల పంటల సాగు
అవిసె చెట్ల పెంపకంతో
వక్క మొక్కలకు సంరక్షణ
ఫలించిన రైతు డబుల్ ధమాకా ప్రయోగం
ఏపుగా పెరుగుతున్న మొక్కలు


