ఇంటి గుట్టు.. రట్టు!
జగనన్న ఇచ్చిన ఇంటినే ప్రారంభించారు
వైఎస్ జగన్ హయాంలో మాకు ఇల్లు మంజూరైంది. అప్పటి ప్రభుత్వం రూ.1.8 లక్షలు మంజూరు చేయగా నిర్మాణం పూర్తి చేశాం. అయితే మరుగుదొడ్డి, రంగులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రూ.70 వేలు ఇవ్వడంతో ఆ పనులు పూర్తి చేశాం. దీంతో అధికారులు కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. గత దసరా రోజున కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు వచ్చి ఇంటిని ప్రారంభించారు. ఈ ఇల్లు తమ ప్రభుత్వం ఇచ్చిందేనని చెప్పమనడంతో ఆ సమావేశంలో చెప్పాం. మా కుటుంబానికి ఇంటి పట్టా సైతం గత ప్రభుత్వంలోనే మంజూరైంది.
– కుమావత్ లక్ష్మీబాయి,
లక్ష్మానాయక్ దంపతులు, పెడపల్లి తండా
లబ్ధిదారులు ముందుకు రావడం లేదు
జిల్లాలో 16 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి రానున్న ఉగాది రోజున ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. అయితే ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. పట్టణాల్లో ఇప్పటికే ఆవాస్ సర్వేలో 62 వేల ఇళ్లు కావాలని దరఖాస్తు చేశారు. గ్రామాల్లో దీని సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తాం.
– వెంకటనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్,
గృహనిర్మాణ శాఖ
పుట్టపర్తి అర్బన్: ఎన్నికల్లో నిరుపేదలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోతొక్కిన చంద్రబాబు.. తమది మంచి ప్రభుత్వమంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. తాను చేయని పనులనూ తన ఖాతాలో వేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టి సుమారు రెండేళ్లు కావొస్తుండగా... పేదలకు ఒక్క ఇంటి పట్టాగాని, ఒక్క ఇల్లు గానీ మంజూరు చేయలేదు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు జగనన్న ఇళ్లపై కన్నేశారు. వైఎస్ జగన్ హయాంలో మంజూరై చిన్నచిన్న పనులతో నిలిచిన వాటిని ఆగమేఘాల మీద పూర్తి చేయించారు. తమ హయాంలో నిరుపేదల ఇంటి కష్టాలు తీర్చామంటూ గొప్పలు చెబుతున్నారు.
ఉగాదికి మరో 16 వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
ఇక రెండో విడతలో జిల్లాలో 16 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని చంద్రబాబు ప్రభుత్వం హౌసింగ్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికి రెండున్నర నెలలు గడిచినా 200 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. ఎంతగా ప్రయత్నించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు మందుకు రావడం లేదని హౌసింగ్ పీడీ వెంకటరమణ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల, బీసీలకు అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యంలో హౌసింగ్ అధికారులు ఆయా వర్గాలపై పడ్డారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఇది అధికారులకు తెలిసినా... లబ్ధిదారుల వద్ద బతిమలాడుతున్నారు. లక్ష్యాలను చేరుకోకుంటే ప్రభుత్వం వద్ద చెడ్డ పేరు వస్తుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
62 వేల దరఖాస్తులు..
‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0’ కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 62 వేల మంది నిరుపేదలు ఇంటి నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. హౌసింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలించి అర్హులను గుర్తించి వారి వివరాలన్నీ ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసి ఉంచారు. అయితే ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని, కనీసం పట్టా కూడా ఇవ్వలేదని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తుల ప్రక్రియనే ప్రారంభం కాలేదు.
జగన్
హయాంలో
అడిగిన వారందరికీ ఇళ్లు..
తిమ్మిని బమ్మి చేయడం... పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు. నిలువ నీడ లేని నిరుపేదలు ఇంటికోసం ఎన్ని దరఖాస్తులిచ్చినా పట్టించుకోని ఆయన..జగన్ హయాంలో మంజూరై అప్పట్లోనే గృహప్రవేశాలు కూడా పూర్తి చేసిన ఇళ్లకు రంగులు కొట్టించి వాటిని మళ్లీ ప్రారంభించారు. వాటి ముందు నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చి ప్రచారం హోరెత్తించారు. పచ్చ నేతలు ప్రచారం చూసి అప్పటికే ఇళ్లు పూర్తి చేసుకున్న నిరుపేదలు ‘‘గృహప్రవేశం.. చేయాలి మళ్లీ మళ్లీ’’ అంటూ నిట్టూరుస్తున్నారు.
పచ్చ ప్రచారం.. ఇళ్లకు పేదలు దూరం
రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని చంద్రబాబు
వైఎస్ జగన్ హయాంలో మంజూరైన ఇళ్లనే ఖాతాలో వేసుకునే కుట్ర
పాత ఇళ్లకే మరమ్మతులు చేయించి..
రంగులు కొట్టించి మళ్లీ ప్రారంభోత్సవాలు
విస్తుపోతున్న లబ్ధిదారులు..
తమకెప్పుడు ఇళ్లిస్తారని ప్రశ్నిస్తున్న పేదలు
వైఎస్ జగన్ తన హయాంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లాకు 66,415 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో జగనన్న లేఅవుట్‌లలో 30,147, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి 36,268 కలిపి మొత్తంగా 66,415 ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే 28 వేల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారు. ఇంకో 28 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 10,415 ఇళ్లు ఇంకా ప్రారంభంకాని (నాన్ స్టార్టెడ్) దశలో ఉన్నాయి. దీంతో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై చంద్రబాబు కన్ను పడింది. వాటిని ఎలాగైనా పూర్తి చేయించి తమ ఖాతాలో వేసుకోవాలని దురాలోచన చేశారు. అనుకున్న వెంటనే వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి నిర్మాణాలు పూర్తి చేయించారు. తొలి విడతగా 2025 నవంబర్‌లో దసరా సందర్భంగా 8,086 ఇళ్లు పూర్తి చేయించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఇంటి గుట్టు.. రట్టు!
ఇంటి గుట్టు.. రట్టు!


