క్వింటా చింతపండు రూ.24 వేలు | - | Sakshi
Sakshi News home page

క్వింటా చింతపండు రూ.24 వేలు

Feb 13 2026 5:27 AM | Updated on Feb 13 2026 5:27 AM

క్వింటా చింతపండు  రూ.24 వేలు

క్వింటా చింతపండు రూ.24 వేలు

హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో గురువారం 2,600 క్వింటాళ్ల చింతపండు రాగా, క్వింటా (కరిపులి రకం) గరిష్టంగా రూ.24 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ఫ్లవర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్‌ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి సరైన ధరలకు విక్రయించుకోవాలని ఆయన సూచించారు.

సోమవారం మార్కెట్‌కు సెలవు..

శివరాత్రి పండుగ నేపథ్యంలో వ్యాపారుల అసోసియేషన్‌, హమాలీల అభ్యర్థన మేరకు ఈనెల 16వ తేదీ (సోమవారం) హిందూపురం మార్కెట్‌యార్డుకు సెలవు ప్రకటించినట్లు యార్డు కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. రైతులు ఈ విషయం గమనించాలన్నారు.

‘నకిలీ’ కేటుగాళ్ల అరెస్ట్‌

అనంతపురం సెంట్రల్‌: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటి కబ్జాకు యత్నించిన కేటుగాళ్లను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. నగరంలోని శారదానగర్‌లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మికి ఇల్లు ఉంది. వీరు 2024 నవంబర్‌లో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన పాములపాటి అమర్నాథ్‌, పుట్టపర్తికి చెందిన ఆవుల సుబ్రహ్మణ్యం ఇంటిని కొట్టేయాలని పథకం రచించారు. హిందూపురానికి చెందిన బి.శకుంతలకు సుసర్ల కనకదుర్గ తన ఇంటిని రాసి ఇచ్చినట్లుగా ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం పుట్టపర్తికి చెందిన శేఖర్‌కు అనంతపురం అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శకుంతల నుంచి జీపీఏ (జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ రమణరావు కనుసన్నల్లో జరిగింది. తర్వాత సదరు జీపీఏ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలకసంస్థ కార్యాలయంలో మ్యుటేషన్‌ చేయించారు. దీనిపై సుసర్ల కనకదుర్గ వారసుడైన సాయి మనోహర్‌ అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులసు ఆశ్రయించాడు. ఎస్పీ జగదీష్‌ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపారు. శకుంతల, శేఖర్‌, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, అమర్నాథ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకూ న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. నిందితుల్లో ఒకడైన పాములపాటి అమర్నాథ్‌పై ఇది వరకూ ఇలాంటివే నాలుగు కేసులు ఉన్నాయి. కేసులో మరికొంతమందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు.

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పొడిగింపు

గుంతకల్లు: గుంతకల్లు డివిజన్‌ మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్‌–అనకాపల్లి (01477) మధ్య ప్రతి శుక్రవారం నడిచే వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలును మార్చి 06వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు (19 సర్వీసులు), అనకాపల్లి–షోలాపూర్‌ (01478) మధ్య ప్రతి శనివారం నడిచే వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలును మార్చి 7 నుంచి జూలై 11 వరకు (19 సర్వీసులు) పొడిగిస్తున్నట్లు వివరించారు. ఈ రైళ్లు అకల్‌కోట్‌, గంగాపూర్‌, కలబురిగి, వాడి, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయ రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, పీలేరు, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, చీరాల, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడం, నిడివేలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించారు.

● కోయంబత్తూర్‌–జైపూర్‌ (06181) ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 26 నుంచి మార్చి 26 వరకు ప్రతి గురువారం (5 సర్వీసులు), జైపూర్‌– కోయంబత్తూర్‌ (06182) ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 01 నుంచి మార్చి 29 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. తిరుపూరు,

యశ్వంత్‌పూర్‌–కలబురిగి మధ్య ప్రత్యేక రైళ్లు..

హోలీ రద్దీని అధిగమించడానికి యశ్వంత్‌పూర్‌–కలబురిగి మధ్య 13, 14వ తేదీల్లో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు 13వ తేదీ శుక్రవారం రాత్రి 10.40 గంటలకు కలబురిగి జంక్షన్‌ (06209) నుంచి బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం 9.15 గంటలకు యశ్వంత్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే రోజు (శని, 14వ తేదీ) ఉదయం 10.15 గంటలకు బయలుదేరి రాత్రి 9.40 గంటలకు కలబురిగి జంక్షన్‌ చేరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement