సస్యరక్షణతో కత్తెర పురుగు నివారణ | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణతో కత్తెర పురుగు నివారణ

Feb 13 2026 5:27 AM | Updated on Feb 13 2026 5:27 AM

సస్యర

సస్యరక్షణతో కత్తెర పురుగు నివారణ

హిందూపురం: సకాలంలో సస్య రక్షణ చర్యలు చేపడితే మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు నివారణ సాధ్యమవుతుందని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎ.కృష్ణయ్య సూచించారు. హిందూపురం మండలం పోచనపల్లిలో రైతు శివలింగప్ప పొలంలో గురువారం చేపట్టిన మొక్కజొన్న, రాగిపంటల ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం మొక్కజొన్న పంటకు ఆశించిన కత్తెర పురుగు నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సురేంద్ర నాయక్‌, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

మట్టి తరలిస్తున్న

టిప్పర్లు, ట్రాక్టర్ల పట్టివేత

పరిగి: మండలంలోని పరిగి చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ రంగడుయాదవ్‌ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ఆయా వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

కొమ్మ విరిగిపడి అంగన్‌వాడీ కార్యకర్తకు తీవ్ర గాయాలు

రొళ్ల: స్థానిక మడకశిర ప్రధాన రహదారిలోని కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం సమీపంలో ఉన్న జువ్విచెట్టు కొమ్మ విరిగి మీద పడడంతో అంగన్‌వాడీ కార్యకర్త జయలక్ష్మి తీవ్రంగా గాయపడింది. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నిరసన కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం మారుతీ నగర్‌లోని తన అంగన్‌వాడీ సెంటర్‌కు భర్తతో కలసి ద్విచక్రవాహనంపై జయలక్ష్మి బయలుదేరింది. కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం సమీపంలోకి చేరుకోగానే పురాతన జువ్వి చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి జయలక్ష్మి మీద పడడంతో తలకు బలమైన గాయమైంది. స్వల్ప గాయాలతో భర్తకు బయట పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న జయలక్ష్మిని స్థానికులు వెంటనే సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని తుమకూరుకు వైద్యులు రెఫర్‌ చేశారు.

కార్మికుడి దుర్మరణం

చిలమత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ గ్రానైట్‌ పరిశ్రమ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. కుటుంట సభ్యులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం కాగానిపల్లికి చెందిన రమేష్‌(28) చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని ముద్దప్పపల్లి సమీపంలో ఉన్న వేదా ఇంటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ గ్రానైట్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో గురువారం చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో తాను పనిచేస్తున్న పరిశ్రమ కూడా మూత పడి ఉంటుందని రమేష్‌ భావించాడు. అయితే యాజమాన్యం పనిలోకి రావాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వాహనంతో పాటు ఉడాయించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, తమ సొంత ఆదాయం కోసం కార్మికుల జీవితాలతో వేదా ఇన్‌టెక్‌ యాజమాన్యం చెలగాటమాడుతోందని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. వెంటనే రమేష్‌ కుటుంబానికి పరిహారం చెల్లించాలని, లేకపోతే పరిశ్రమ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

బావిలో పడి యువకుడి మృతి

మడకశిర: స్థానిక పట్టణ పరిధిలోని చౌటిపల్లిలో ఓ యువకుడు బావిలో పడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మంజునాథ్‌ (25) గురువారం ఉదయమే తన తోట వద్దకెళ్లాడు. నీటి కోసం బావిలో దిగుతుండగా అదుపు తప్పి నీటిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ లావణ్య అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

యువకుడి ఆత్మహత్య

కదిరి టౌన్‌: స్థానిక దేవళం వీధిలో నివాసముంటున్న వినయ్‌ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహాది శుభకార్యాలకు డెకరేషన్‌ పనితో జీవనం సాగిస్తున్న ఆయకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో భార్య శ్రీశైలం వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం రాత్రి తన గోదాములో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కుమారుడు గమనించి నాన్నమ్మకు తెలపడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వినయ్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సస్యరక్షణతో  కత్తెర పురుగు నివారణ 1
1/2

సస్యరక్షణతో కత్తెర పురుగు నివారణ

సస్యరక్షణతో  కత్తెర పురుగు నివారణ 2
2/2

సస్యరక్షణతో కత్తెర పురుగు నివారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement