ల్యాండ్ టైట్లింగ్ ఆదర్శం
భూమికి, వాటి యజమానులకు రక్షణగా నిలిచేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ విషం చిమ్మింది. పచ్చమీడియా విషప్రచారం చేసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో దావోస్ వేదికగా ఇటీవల జరిగిన సదస్సులో ఆ విష ప్రచారం బట్టబయలైంది. నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనం.. ఆవశ్యకతను వివరిస్తూ ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ ప్రశంసలు కురిపించారు. అది కూడా సీఎం చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో.. ఆయన సమక్షంలోనే ప్రశంసించడం గమనార్హం.
అనంతపురం అర్బన్: భూ యాజమాన్యానికి సంబంధించి గ్రామస్థాయిలో 1బి, అసైన్‌మెంట్, ఈనాం వంటి పలు రిజిస్టర్లు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే భూ రికార్డుల శాఖ కార్యాలయంలో మరికొన్ని, సబ్‌రిజిస్ట్రార్, పంచాయతీ, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఇంకొన్ని రికార్డులు నిర్వహిస్తుంటారు. అటవీ, దేవదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా... చట్టపరంగా ఏదీ తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా... వేరే వాళ్లు అది తనదని దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇలాంటి కేసులు కోర్టులో చాలా నడుస్తున్నాయి. అయితే టైట్లింగ్ చట్టం ద్వారా ఒక్కసారి రిజిస్టర్ అయితే భూ యజమానులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఆ హక్కులపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లూ ఉంటాయి. ఇంతటి బృహత్తర చట్టాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తయితే ఇక తమకు విలువ ఉండదని భావించిన అప్పటి ప్రతిపక్ష టీడీపీ... పచ్చ మీడియా విష ప్రచారాన్ని చేపట్టాయి. చివరకు అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌పై అక్కసుతో ఆ చట్టాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేశారు.
హుక్కులకు ప్రభుత్వ పూచీ
● ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ జవాబుదారీ వహించదు.
● రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని... రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో తీర్పులు వెలువరించింది.
● టైట్లింగ్ చట్టం కింద రూపొందించిన రిజిస్టర్ ప్రకారం టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో పాత రికార్డులేవీ చెల్లవు. టైట్లింగ్ ద్వారా భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్‌లో పేరు నమోదైన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా పరిహారం కూడా చెల్లిస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.
● టైటిల్ రిజిస్టర్‌లో పేరు నమోదయ్యాక ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే రెండేళ్లలోపు దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్‌లో ఉన్న పేరే ఖరారు అవుతుంది. టైట్లింగ్ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒక్కసారి నిర్ధారణ అయితే అదే అంతిమ నిర్ణయం అవుతుంది.
● భూములకు సంబంధించిన వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా నమోదు చేస్తారు. టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్య తలెత్తితే పరిష్కారానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుతంలా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లవచ్చు.
● ఇప్పటి వరకూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్టేషన్ మాత్రమే జరుగుతుంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అయితే ల్యాండ్ టైటిల్ చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. ఈ వ్యవస్థను జిల్లా, రాష్ట్ర స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
అప్పట్లోనే స్పష్టత ఇచ్చిన నీతి ఆయోగ్
తప్పుడు పత్రాలతో... భూ యజమానుల తప్పుడు ఆధార్‌లు సృష్టించి వారి భూములను వేరొకరికి విక్రయించిన పలు ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. వీటిపై పోలీసు విచారణ జరగడం... వాస్తవమని నిర్దారణ కావడం... తదనంతరం కేసులు నమోదు కావడం... తదితర పరిణామాలు ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలిసిందే. ఇదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద రిజిస్టర్ జరిగితే... యజమానిని కాదని వారి భూమిని తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భూ యజమానులకు సంపూర్ణ భరోసానిస్తూ జగన్ ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రవేశపెట్టగానే రాజకీయాల్లో పెను దుమారం రేగింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఈ అంశంపై అప్పటి అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఆ సమయంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టం పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబునిచ్చింది. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని స్పష్టం చేసింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని పేర్కొంది.
గత జగన్ ప్రభుత్వం చేపట్టిన టైట్లింగ్ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో కితాబు
చంద్రబాబు సమక్షంలోనే దావోస్ వేదికగా అభినందనల వెల్లువ
అయినా వైఎస్ జగన్‌పై అక్కసుతో రద్దు చేసిన చంద్రబాబు సర్కారు


