సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి

Feb 12 2026 7:18 AM | Updated on Feb 12 2026 7:18 AM

సబ్‌

సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి

ధర్మవరం అర్బన్‌: సబ్‌ జైలులో ఖైదీలకు సదుపాయాలు సక్రమంగా ఉండాలని సంబంధిత అధికారులను ఉమ్మడి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశించారు. బుధవారం ధర్మవరంలోని సబ్‌ జైలును న్యాయమూర్తి తనిఖీ చేశారు. వంట గది, బ్యారెక్‌లు, సరుకుల నిల్వ గది, జైలు పరిసరాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ.. వసతులపై ఆరా తీశారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. ఉచిత న్యాయ సహాయ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్‌ జైలు ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ శివరామకృష్ణయ్య, న్యాయవాదులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

పుట్టపర్తి టౌన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ)లో భాగంగా లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ల్లో డ్రాయింగ్‌, హ్యాండ్లూమ్‌ వీవింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ శిక్షణకు సంబంధించి ఈ నెల ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ కొత్తచెరువులోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడు చేసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్‌

కడప అర్బన్‌: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్‌ సైకిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్‌ చేసినట్లు కడప అర్బన్‌ పీఎస్‌ ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక తాలూకా పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీ కుంట మండలం గౌకనపల్లికి చెందిన షేక్‌ దర్బార్‌ వలి గతంలో సెల్‌ఫోన్‌ దొంగతనాల కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన విధానాలు మార్చుకోకుండా మోటార్‌ సైకిళ్లను అపహరించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్‌ సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న విషయాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు అపహరణ

కనగానపల్లి: ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కొని ఉడాయించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు శ్రీరెడ్డి నారాయణమ్మ మధ్యాహ్నం ఒంటరిగా ఇంటికి వెళుతుండగా రోడ్డు పక్కన మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసు లాక్కొని ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. ఆ సమయంలో ఆమె కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకునే లోపు దుండగులు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ శ్రీధర్‌, కనగానపల్లి ఎస్‌ఐ రిజ్వాన్‌ వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలితో వివరాలు ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చోరీ కేసుల్లో పలువురి అరెస్ట్‌

పెనుకొండ: వివిధ చోరీ కేసుల్లో పలువురిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. వివిధ కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల మేరకు తమ పరిధిలో ఉన్న కేసుల్లో నిందితులను బుధవారం అరెస్ట్‌ చేసి, రూ. 50.40 లక్షల విలువ చేసే బంగారంతో ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మరికొందరిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు.

సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి1
1/2

సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి

సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి2
2/2

సబ్‌ జైలును పరిశీలించిన న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement