తల్లిని దూషించాడని హత్య
హిందూపురం: స్థానిక నింకంపలి్‌ల్ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఈ నెల 7న కుళ్లిన స్థితిలో బయటపడిన యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం రెండో పట్టణ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐలు అబ్దుల్ కరీం, రాజగోపాల నాయుడు, జనార్ధన్ వెల్లడించారు. నింకంపల్లి సమీపంలోని పాడుబడిన బావి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో గత శనివారం సమీప ప్రాంతాల వారు వెళ్లి చూశారు. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పరిశీలించారు. గొంతు కోసి ఉండడంతో హత్యగా నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హతుడిని హస్నాబాద్‌కు చెందిన సుహేబ్(25)గా నిర్ధారించారు. ఎలక్ట్రీషియన్ పనితో జీవనం సాగించేవాడు. రెండు, మూడు రోజుల క్రితం కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడి సుహేబ్‌ను గొంతుకోసి హతమార్చి, మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు అనుమానితులైన యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హతుడు సుహేబ్, కల్లూరు మహమ్మద్ ముల్లాఖాన్ ఇరువురూ మంచి స్నేహితులుగా తేలింది. తరుచూ మద్యం సేవిస్తుండేవారు. ఓ రోజు మద్యం మత్తులో గొడవపడ్డారు. ఆ సమయంలో ముల్లాఖాన్ తల్లిని సుహేబ్ దూషించాడు. దీంతో కక్ష పెంచుకున్న ముల్లాఖాన్ పథకం ప్రకారం ఈ నెల 2న సుహేబ్‌ను నింకంపల్లి శ్మశాన వాటిక సమీపంలోని సత్రాల వద్దకు పిలుచుకెళ్లి అక్కడ మద్యం సేవించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ముల్లాఖాన్ కత్తితో పొడవడంతో సుహేబ్ గట్టిగా అరవబోయాడు. దీంతో వెంటనే గొంతు కోశాడు. అనంతరం ఓ మైనర్ బాలుడి సాయంతో సుహేబ్ మృతదేహాన్ని చెత్తాచెదారంతో చుట్టేసి అక్కడికి సమీపంలోని పాడుపడిన బావిలో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై హతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముల్లాఖాన్‌ను బుధవారం అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడికి సహకరించిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ
ఈ నెల 2న హత్య.. 7న మృతదేహం లభ్యం
ప్రధాన నిందితుడి అరెస్ట్
అజ్ఞాతంలోకి
‘మైనర్’ నిందితుడు


