లీప్ టీచర్ల క్రికెట్ టోర్నీలో జిల్లా జట్టు విజయం
ధర్మవరం రూరల్: లీప్ టీచర్ల టోర్నమెంట్‌లో భాగంగా గుంటూరు వేదికగా మంగళవారం జరిగిన క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో అనకాపల్లి జట్టుపై జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టు క్రీడాకారులు బుధవారం ధర్మవరానికి చేరుకోగా, వారిని ఎంఈఓలు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, ఆర్డీటీ ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
రాప్తాడు రూరల్: విద్యుత్ షాక్‌కు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి (64) అనంతపురంలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలం సజ్జలకాలువలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో విద్యుద్దీకరణ పనుల్లో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. భార్య నాగేశ్వరి బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నేడు సార్వత్రిక సమ్మె
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. ఇందులో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, రైతులు పాల్గొననున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎస్సార్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐసీసీటీయూ, రైతు, కౌలు రైతు, పండ్లతోటల రైతుల, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని, హైర్ అండ్ ఫెయిర్ విధానం రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధి భద్రత కల్పించాలని, ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, కనీస వేతనం పెంచాలని, పంటలకు మద్దతు ధర కల్పించాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, ప్రభుత్వరంగ పరిశ్రమలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.


