ఆక్రమణలపై చర్యలు శూన్యం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై చర్యలు శూన్యం

Feb 11 2026 8:45 AM | Updated on Feb 11 2026 8:45 AM

ఆక్రమ

ఆక్రమణలపై చర్యలు శూన్యం

పుట్టపర్తి అర్బన్‌: వాగులు, వంకలు, చెరువులు, నదులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కూటమి నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని పని కానిచ్చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాలు ఆక్రమిస్తున్నా ఆయన సైతం మనవాల్లే కదా అని వెనుకేసుకొస్తున్నట్లు తెలిసింది. పర్యాటక కేంద్రమైన పుట్టపర్తి పరిధిలోని చిత్రావతి నదికి ఇరువైపులా స్థలాలు ఆక్రమించి భవనాలు నిర్మించారు. లోకాయుక్తలో కేసు నడుస్తున్నా ఆక్రమణలకు విరామం ఇవ్వకుండా కబ్జా చేస్తూనే ఉన్నారు. ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకున్నా కొంత విరామం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ కబ్జా పర్వాన్ని మొదలు పెట్టారు. కబ్జాల వ్యవహారంపై కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఇటీవల సీరియస్‌ కావడంతో ఆక్రమణలపై ఇరిగేషన్‌ అధికారులు నివేదికను సిద్ధం చేసి సమర్పించినట్లు తెలిసింది.

ప్రభుత్వ స్థలాలే టార్గెట్‌

ఇటీవల సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను అడ్డుపెట్టుకొని ఇరిగేషన్‌ కార్యాలయం చుట్టూ ఉన్న అర ఎకరా స్థలాన్ని ఆక్రమించడానికి మట్టి తోలి చదును చేసి సిద్ధం చేశారు. మట్టి తోలి సిద్ధం చేయగానే ఎనుములపల్లికి చెందిన చెరువు సంఘం అధ్యక్షుడు, టీడీపీ నేత చిమిరాల సుధాకర్‌ తన స్వంత స్థలంలోకి చెరువు స్థలాన్ని కలుపుకునే ప్రయత్నాలు చేశారు. పక్కనే ఇరిగేషన్‌ కార్యాలయం ఉన్నా పట్టించుకోలేదు. చివరకు ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తీసుకురాగానే ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. అయితే అధికారులు మాత్రం ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మరికొంత కాలం గడిస్తే పట్టించుకోకుండా ఆయనకే వదిలేసేలా ఉన్నారన్న విమర్శలున్నాయి. కర్ణాటక నాగేపల్లి వద్ద చిత్రావతి నదిని ఆనుకొని ఇరిగేషన్‌కు చెందిన సుమారు అర ఎకరా స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. లక్షలాది రూపాయల బిల్లులు చేయించడానికి సిద్ధం చేశారు. దీన్ని సైతం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ప్రస్తుతానికి నిర్మాణాలు ఆపేశారు. అయితే అందులోని నిర్మాణ సామగ్రి, ఇటుకలు అలాగే ఉంచారు. రాత్రిళ్లు నిర్మాణాలు చేపట్టినా ఆశ్చర్య పోనవరం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే స్థానిక ఆర్టీసీ బస్‌ డిపో వద్ద సుమారు అర ఎకరా స్థలంలో పార్కు పేరు చెప్పి నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు పూర్తి కాకనే స్థానిక ఎమ్మెల్యే పార్కును ప్రారంభించేశారు. అందులో ఒక్క మొక్క కూడా పెట్టలేదు. ప్రస్తుతానికి పార్కుకు తాళం వేసి మూసేశారు. దీని బిల్లుల కోసం కమిషనర్‌పై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన లాంగ్‌ లీవ్‌ పెట్టి పెట్టె బేడా సర్దుకున్నారు.

మూడు ఎకరాల స్థలం ఆక్రమణ

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద ఓ నాయకుడు సర్వే నంబర్‌ 178లో సుమారు 3 ఎకరాలు ఇరిగేషన్‌కు చెందిన భూమిని ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. దీనిపై బత్తలపల్లి, గువ్వలగుట్టపల్లి గ్రామస్తులు, రైతులు కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు సైతం సమర్పించారు. తమ చెరువుకు నీళ్లు రాకుండా అడ్డు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరితే పట్టా రద్దు చేశామని చెబుతున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఆర్డీఓను ఆశ్రయించినా ఫలితం లేదంటున్నారు. కబ్జాలపై ఇరిగేషన్‌ అధికారులు కలెక్టర్‌కు నివేదికను సమర్పించడంతో దాని ఆధారంగానైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న చర్చసాగుతోంది.

కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన ఇరిగేషన్‌ అధికారులు

నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేరా?

ఆక్రమణలపై చర్యలు శూన్యం 1
1/1

ఆక్రమణలపై చర్యలు శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement