మహిమాన్వితుడు వీరనారాయణస్వామి
ముదిగుబ్బ: మండలంలోని సంకేపల్లి గ్రామ సమీపంలో వెలసిన వీరనారాయణ స్వామి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. చిన్నపాటి గుడిసెలో ఉన్నా.. నిత్య పూజలు, మహా అన్నదానాలతో భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఏటా మహాశివరాత్రి మరుసటి రోజు ఆలయం వద్ద పరుస నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఆలయం వద్ద నిర్వహించనున్న పరుసకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు.
ఉత్సవాలు జరిగేది ఇలా..
ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లిలో ఉన్న వీరనారాయణ స్వామి ఆలయం నుంచి శివరాత్రి పర్వదినాన ఉదయాన్నే ఉపవాస దీక్షతో కాలినడకన భక్తులు, ఆలయ పూజారులు కన్యకలగొందికి చేరుకుంటారు. అక్కడ వెలసిన శివాలయంలో ఆదిదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డప్పు వాయిద్యాలతో బుక్కపట్నం మండలం పాముదుర్తికి చేరుకుని వీరనారాయణ స్వామికి ప్రీతిపాత్రులైన పూజారి తాళ్ల జంగమన్న వంశస్తులతో కలసి యలగల గంప (వెదురు దబ్బలతో అల్లిన గంప)ను తీసుకుని పాముదుర్తిలోని రెడ్డివారి బావి వద్ద గంగ పూజను నిర్వహిస్తారు. అనంతరం కన్యకలగొందికి చేరుకుని శివాలయంలో యలగలగంపను పూలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత డప్పు వాయిద్యాలతో యలగలగంపను ఊరేగింపుగా గుంజేపల్లి మీదుగా సంకేపల్లి వద్ద ఉన్న పరుస మాన్ల వద్దకు చేర్చి గద్దైపె వీరనారాయణస్వామి యలగలగంపను అధిష్టింపజేస్తారు. ఈ పూజలు నిర్వహించేందుకు ఒక రోజు సమయం పడుతుంది. శివరాత్రి జాగారం అనంతరం మరుసటి రోజున పరుసమాన్లలో వీరనారాయణస్వామికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పరుసను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవంలో యలగలగంపను దర్శించుకుంటే ఎలాంటి ఆపదలు కలగవని భక్తుల నమ్మకం. యలగలగంపను స్వామి ఆవహించి ఉంటాడని విశ్వాసం.
భారీగా తరలి రానున్న భక్తులు..
వీరనారాయణస్వామి పరుసకు భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఎడ్లబండ్లను కట్టుకుని రైతు కుటుంబాలు, కొత్తగా కొన్న పశువులను వెంటబెట్టుకుని రైతులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో సంకేపల్లి సమీపంలోని వీరనారాయణస్వామి ఆలయానిక చేరుకుంటారు. అక్కడ యలగలగంపను అధిష్టింపజేసిన గద్దె చుట్టూ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, పశువులతో ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని, ఏడాది పొడువునా ఎలాంటి ఆపదలు కలగకుండా స్వామి కాపాడుతాడని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని భక్తుల నమ్మకం. పరుస రోజున అక్కడే ఉన్న పూజారి వంశీకులలో ఒకరిని స్వామి ఆవహించి భవిష్యవాణిని వినిపిస్తారు. ఏడాదిలో వర్షాల ఆగమనం, పంటలు పండే తీరును తెలుసుకుని వాటికి అనుగుణంగా రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతుంటారు. పరుసకు ఏపీ నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
వసతులు కల్పించేరా?
లక్షలాది మంది భక్తులు హాజరయ్యే వీరనారాయణ స్వామి పరుసకు వసతులు కల్పించడంలో అధికారులు ప్రతిసారి విఫలమతున్నారు. మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఏటా భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీంతో పాటు పరుసమాన్ల వద్దకు వెళ్లే రహదారి ఒన్‌వే కావడంతో రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటోంది. పరుసలోకి వెళ్లడానికి సంకేపల్లి మీదుగా, బయటకు రావడానికి కమ్మవారిపల్లి మీదుగా అధికారులు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మండల ప్రజలు కోరుతున్నారు.
పాతూరులో పెద్దమ్మ స్వామి పరుష..
ముదిగుబ్బ పాతూరులో వెలసిన పెద్దమ్మస్వామి ఆలయాన్ని శివరాత్రి పర్వదినం సందర్భంగా ముస్తాబు చేస్తారు. జాగారం రాత్రి పెద్దమ్మస్వామి మూలవిరాట్‌ను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి పల్లకీలో పురవీధుల గుండా ఊరేగిస్తారు. తెల్లవారేసరికి పల్లకీని గ్రామం వెలుపల ఉన్న నల్లలమ్మ స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లతారు. అక్కడ పెద్దమ్మ స్వామి పరుసను ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పరుసకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
ఈ నెల 16న పరుస
భవిష్యవాణి వినేందుకు
వేలాదిగా తరలిరానున్న భక్తులు


