పెళ్లి చేసుకుని ఉన్నదంతా ఊడ్చేసింది!
పుట్టపర్తి టౌన్: తొలి భర్తకు విడాకులివ్వకుండానే తనను రెండో పెళ్లి చేసుకుని తన వద్ద ఉన్నదంతా ఊడ్చేసిందని, విచారణ జరిపి న్యాయం చేయాలని పెనుకొండకు చెందిన సుబ్బారావు అడిషనల్ ఎస్పీ అంకిత సురానాను కోరారు. తనకు జరిగిన అన్యాయంపై పెనుకొండ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పట్టించుకోలేదన్నారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మరో బాధితుడు రమేష్‌తో కలిసి తన భార్య మహాలక్ష్మిపై ఫిర్యాదు చేశాడు.
నగదు, నగలు ఎత్తుకెళ్లింది..
పెనుకొండకు చెందిన సుబ్బారావు పట్టణంలో సిమెంట్ రింగులు విక్రయిస్తూ జీవనం సాగించే వాడు. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పామిడికి చెందిన పెళ్లిళ్ల పేరయ్య మస్తానయ్యను సంప్రదించారు. దీంతో మస్తానయ్య పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి సంబంధం కుదిర్చి ఓ గుడిలో ఇద్దరికీ పెళ్లిచేశాడు. అయితే మహాలక్ష్మికి అప్పటికే రమేష్ అనే వ్యక్తితో వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. ఈ విషయం తెలియని సుబ్బారావు ఆమెను పెళ్లి చేసుకుని పెనుకొండలోనే కాపురం పెట్టాడు. మూడు నెలల తర్వాత ఇంటి పనులకు సాయంగా ఉంటారని తన బంధువులను ముగ్గురిని పెనుకొండకు పిలిపించుకున్న మహాలక్ష్మి ఆ తర్వాత తన అసలు రంగు బయటపెట్టింది. సుబ్బారావును చిత్రహింసలకు గురిచేసింది. చివరకు సుబ్బారావుతో గొడవ పడి 30 తులాల బంగారం, ఇంటిపత్రాలు తీసుకొని నెల్లూరుకు వెళ్లిపోయింది. పెళ్లి కుదిర్చిన మస్తానయ్య వద్దకు వెళ్లితే ఆయన పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో సుబ్బారావె తన బంధువులతో కలిసి నెల్లూరుకు వెళ్లి మహాలక్ష్మిని కాపురానికి రావాలని కోరినా ఆమె నిరాకరించింది. దీంతో ఇరుగుపొరుగుతో వివరాలు ఆరా తీయగా ఆమె మొదటి భర్త రమేష్ గురించి తెలపడంతో ఆయన్ను కూడా కలిశాడు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి నెల్లూరు పోలీస్టేషన్‌లో సుబ్బారావు వేధిస్తున్నాడని, విడాకులు కావాలని కేసు పెట్టింది. భరణం కింద రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో సుబ్బారావు నెల్లూరులో మరింత లోతుగా విచారించగా మహాలక్ష్మి ఇలా చాలా మందిని మోసం చేసిందని... నిత్యం పెళ్లిళ్లు చేసుకుంటూ మోసం చేస్తోందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతను సోమవారం ఏఎస్పీ అంకిత సురానాను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన ఏఎస్పీ విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నిత్యపెళ్లి కూతురిపై చర్యలు తీసుకోండి
పరిష్కార వేదికలో ఏఏస్పీ సురానాకు విన్నవించిన బాధితుడు
పరిష్కార వేదికకు 90 వినతులు..
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అందే అర్జీలన్నీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అడిషనల్ ఎస్పీ అంకితా సురానా పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 90 వినతులు అందాయి. అడిషనల్ ఎస్పీ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు న్యాయ సలహాదారుడు సాయినాథ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ ఇస్మాయిల్, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెళ్లి చేసుకుని ఉన్నదంతా ఊడ్చేసింది!


