చికిత్స పొందుతూ చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

తల్లి పరిస్థితి విషమం

నల్లచెరువు: కదిరి సమీపంలోని కౌలేపల్లి గ్రామం వద్ద 42వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడిన చిన్నారి షాఫియా కౌసర్‌(1) అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తల్లి సల్మా పరిస్థితి విషమంగా ఉంది. కదిరి పట్టణ పోలీసులు తెలిపిన మేరకు... నల్లచెరువు మండలం ఊబిచెర్ల గ్రామానికి చెందిన షేక్‌ షాజహాన్‌, సల్మా దంపతులు జ్వరంతో బాధపడుతున్న తమ కుమార్తె షాఫియా కౌసర్‌కు చికిత్స చేయించేందుకు ఆదివారం రాత్రి కదిరిలోని ఆస్పత్రికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కౌలేపల్లి సమీపంలోకి చేరుకోగానే మదనపల్లి వైపుగా వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న షాఫియా, సల్మాను అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కదిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

రిమాండ్‌కు హత్య కేసులో నిందితుడు

రొళ్ల: మండలంలోని ఎం.రాయాపురం గ్రామంలో గత శనివారం సాయంత్రం కట్టెతో బాది దివ్యాంగుడు ప్రసన్నకుమార్‌ (40)ను హతమార్చిన కేసులో నిందితుడు నాగరాజప్పను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌ వెల్లడించారు.

యువతి బలవన్మరణం

తనకల్లు: ఒంటరితనాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తనకల్లులోని సంజీవయ్య నగర్‌లో నివాసముంటున్న జయమ్మ, రామాంజులు దంపతులు అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి వీరి కుమార్తె రెడ్డి ప్రసన్న తన పిన్ని ఈశ్వరమ్మ వద్దే ఉంటూ వెటర్నరీ కోర్సు పూర్తి చేసింది. మూడు నెలల క్రితం పిన్ని కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో ఒంటరిగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోసమని హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె అక్కడ పని నచ్చక తిరిగి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో ఒంటరితనాన్ని భరించలేక మనోవేదనకు లోనైన రెడ్డి ప్రసన్న (21) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టపక్కల వారి సమాచారంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

వ్యక్తి మృతిపై కలకలం

గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన బంధువులు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఖననం చేసిన ఘటన బత్తలపల్లి మండలం పత్యాపురం తండాలో కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన నాగభూషణ్‌ నాయక్‌ వారం రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకున్నట్లుగా తెలిసింది. దీంతో ఓ ఆటోలో అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి గుట్టు చప్పుడు కాకుండా వైద్యం అందించారు. రెండు రోజుల అనంతరం మృతి చెందినట్లుగా సమాచారం. ఉరి వేసుకుని చనిపోయారంటూ బంధువులు చెబుతున్నా.. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే పోలీసులు అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు బయటపడకుండా ఉండేందుకు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లి పెడదారి పట్టించనట్లుగా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement