అప్రమత్తంగా ఉండండి
చిలమత్తూరు: మహిళలపై కేన్సర్ పంజా విసురుతోంది. జిల్లాలో సర్వైకల్, రొమ్ము, నోటి కేన్సర్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కేన్సర్లకు కారణమవుతున్నాయి. జిల్లాలో సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి అనుమానిత కేసులు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అలాంటి వారిని వైద్యులు పరీక్షల నిమిత్తం అనంతపురం జిల్లా సర్వజనాసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిల్లో తరచూ నిర్వహిస్తున్న సర్వేల్లో పదుల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కేసుల గుర్తింపులో నిమగ్నమైంది.
30 ఏళ్లు దాటితే స్క్రీనింగ్ తప్పనిసరి..
గర్భాశయ ముఖద్వార కేన్సర్ ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ ప్రభావంతో ఈ కేన్సర్ సోకుతోంది. అసురక్షిత శృంగారం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధకశక్తి ఈ వైరస్‌ను ఎదుర్కోలేని పరిస్థితుల్లో గర్భాశయ కణాల్లో మార్పులు తెచ్చి కేన్సర్‌గా మారుస్తుంది. 30 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వైరస్ సోకగానే కేన్సర్ లక్షణాలు కనిపించే అవకాశం ఉండదు. 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే లక్షణాలు బయటపడతాయి. అందుకే 30 ఏళ్ల తర్వాత మహిళలు స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా దీని బారి నుంచి బయట పడే అవకాశాలు ఉన్నాయి.
కారణాలెన్నో..
హార్మోన్ల అసమతుల్యత కారణంగా రొమ్ము కేన్సర్ వస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో వచ్చే మార్పులు రొమ్ము కేన్సర్‌కు ప్రధాన కారణం. అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, జంక్‌ఫుడ్, పోషకాహార లోపం, అబార్షన్ కిట్‌లు, స్టెరాయిడ్‌ల వాడకం వల్ల హార్మోన్ల సమతుల్యత లోపించడం, తల్లి పాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతోనూ రొమ్ము కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
మామోగ్రామ్ ద్వారా గుర్తింపు..
మామోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము కేన్సర్‌ను గుర్తించవచ్చు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చేపడుతోన్న సర్వేలో లక్షణాలను గుర్తించిన వారిని మామోగ్రామ్ పరీక్ష కోసం అనంతపురం తరలిస్తున్నారు. పాజిటివ్ లక్షణాలు వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. పొగాకు ఉత్పత్తులు, గుట్కా వాడకం, నోటి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల నోటి కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
సిబ్బందికి సహకరిస్తే మేలు..
సర్వేలో భాగంగా మహిళల్లో కేన్సర్ లక్షణాలను గుర్తించేందుకు వెళ్తున్న వైద్య సిబ్బందికి మహిళలు సహకరించడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కేన్సర్ దశలను గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతుండడం గమనార్హం. మహిళలు తమలో తలెత్తుతున్న లక్షణాలు చెప్పకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చిలమత్తూరు మండలంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఇటీవల రొమ్ము కేన్సర్ బారిన పడినట్లు గుర్తించారు. వైద్య సిబ్బంది నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎలాంటి ముందస్తు టెస్ట్‌లు చేయించుకోకపోవడం, కనీసం అవగాహన లేకపోవడంతోనే కేన్సర్ బారిన పడినట్లు ఆలస్యంగా తేలింది. అలాగే, దేమకేతేపల్లి పంచాయతీలో ఓ మహిళకు వైద్య సిబ్బంది సర్వైకల్ కేన్సర్ లక్షణాలు గుర్తించి స్క్రీనింగ్ నిమిత్తం జిల్లా ఆస్పత్రికి పంపడం గమనార్హం.
మహిళల్లో పెరుగుతున్న కేన్సర్లు
ఆధునిక జీవనశైలి, ఆహారంలో మార్పులే కారణం
సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యు నిపుణుల సూచన
మహిళలు సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. హార్మోన్ల అసమతుల్యత, జంక్ ఫుడ్ అధికమై కేన్సర్‌లు వస్తున్నాయి. ఏవైనా నొప్పిలేని గడ్డలు ఉన్నట్టయితే వైద్యులను సంప్రదించి స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా టెస్ట్‌లు చేయిస్తోంది. అంతే కాకుండా 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీపీ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నాం. 40 ఏళ్ల లోపు వాళ్లకు కూడా వేయాల్సి ఉంటుంది.
– డాక్టర్ లావణ్య,
మెడికల్ ఆఫీసర్, చిలమత్తూరు
అప్రమత్తంగా ఉండండి


