వైభవం.. వీరకేతమ్మ బ్రహ్మ రథోత్సవం
మడకశిరరూరల్: మండలంలోని కల్లుమర్రి గ్రామ సమీపంలో ఆదివారం వీరకేతమ్మ బ్రహ్మ రథోత్సవం వైభవంగా జరి గింది. వేకువ జామున ఆలయంలో పురోహితులు అభిషేకం,తోమాలపూజ, నాగదేవత హోమం, చండీయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తిని బ్రహ్మ రథంలో ఆశీనులను గావించి ఉత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి నామాన్ని స్మరిస్తూ బ్రహ్మరథాన్ని ముందుకు లాగారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, జాకెట్లు అందజేసి ఆశీర్వదించారు. బ్రహ్మరథోత్సవం సందర్భంగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ మడకశిర నియోజకవర్గ అధ్యక్షుడు వైసీ గోవర్దన్‌రెడ్డి దంపతులు, మాజీ సర్పంచ్ శ్రీరాములు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలు, భక్తుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు.
వైభవం.. వీరకేతమ్మ బ్రహ్మ రథోత్సవం


