బాలయ్య ఇలాకా.. ‘తమ్ముళ్ల’ మజాకా
హిందూపురం: సీఎం చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఇలాకాలో ‘తమ్ముళ్లు’ బరితెగిస్తున్నారు. కబ్జాలకు కాదేదీ అనర్హం అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలపై కన్నేసి ఆక్రమించేస్తున్నారు. ‘పచ్చ’ నేతలు యథేచ్ఛగా పాగా వేస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. హిందూపురంలోని కోట ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం రెవెన్యూ స్థలంలో భవనం నిర్మించారు. అందులో టూటౌన్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే, ఆరేళ్ల క్రితం రహమత్‌పురం బైపాస్‌రోడ్డులో ప్రభుత్వ స్థలంలో కొత్త భవనం నిర్మించి స్టేషన్ కార్యకలాపాలను అక్కడికి మార్చారు. ఇది జరిగిన కొన్నాళ్లకు కోట ప్రాంతంలోని పాత భవనంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సచివాలయం ఏర్పాటు చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయాన్ని అక్కడి నుంచి తొలగించారు. భవనమున్న స్థలం విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ. కోట్లలో పలుకుతోంది. ఈ క్రమంలో ‘పచ్చ’ కబ్జాదారుల కన్ను భవనంపై పడింది. ఇటీవల రాత్రికిరాత్రే జేసీబీతో భవనాన్ని కూల్చివేశారు. ఎవరైనా అడిగితే పేట వేంకటరమణస్వామి రథం నిలపడానికి భవనం కూల్చామని చెబుతున్నట్లు తెలిసింది. అయితే, స్థలాన్ని ఎలాగైనా మింగేయాలనే పన్నాగంతోనే టీడీపీ నేతలు బరితెగించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణేదీ..?
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, అమాయకుల ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. రాత్రి వేళ జేసీబీలతో ధ్వంసం చేయడం ఆనవాయితీగా మారింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికార పార్టీ గద్దలు వాలిపోతుండడంతో సర్వత్రా భయాందోళన వ్యక్తమవుమతోంది. కబ్జాకోరులకు అధికార అండ ఉండడంతో ప్రశ్నించేందుకు జనం జంకుతున్నారు. పట్టణంలో ఐదు నెలల క్రితం 200 మంది పాడి రైతులకు సంబంధించిన పాల డెయిరీ భవనాన్ని కొందరు రాత్రికి రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై బాధిత రైతులు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంతవరకు భవనాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరన్నది పోలీసులు తేల్చకపోవడం గమనార్హం. కాగా, కోట ప్రాంతంలో ప్రభుత్వ భవనాన్ని కూల్చడంపై వివరణ కోరేందుకు పలుమార్లు తహసీల్దార్ వెంక టేశ్‌కు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వివరణ కోరగా ఆయన స్పందించారు. పాత టూటౌన్ పోలీసుస్టేషన్ భవనాన్ని కొందరు కూల్చినట్లు తెలిసిందని, అది రెవెన్యూకు చెందిన స్థలం కావడంతో పూర్తి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు.
ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా
‘పచ్చ’ నేతల పాగా
పాత పోలీసుస్టేషన్ భవనం
రాత్రికిరాత్రే జేసీబీలతో కూల్చివేత
చోద్యం చూస్తున్న అధికారులపై
సర్వత్రా విమర్శలు


