గ్రంథాలయం.. నిర్వీర్యం
పెనుకొండ రూరల్: ఆధునిక దేవాలయాలుగా చెప్పుకునే గ్రంథాలయాలు చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమవుతున్నాయి. గ్రంథాలయాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం.. పుస్తకాలు ఎప్పటికప్పుడు అందించకపోవడం వెరసి వాటి మనగడే ప్రశ్నార్థకంగా మారిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లేకపోవడంతో పాఠకుల నుంచి గ్రంథాలయాలకు ఆదరణ కరువవుతోంది.
2023 నాటి పుస్తకాలే...
చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలను సరఫరా చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్, క్రీడా అంశాలు, రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎకానమీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అవసరం ఉంటాయి. గడిచిన రెండేళ్లుగా క్రీడా, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే, ప్రభుత్వం ఆయా పుస్తకాలను గ్రంథాలయాలకు సరఫరా చేయలేదు. అసలు రెండేళ్లుగా కొత్త పుస్తకాలనే కొనుగోలు చేయకపోవడం గమనార్హం. 2023లో సరఫరా అయిన పుస్తకాలే ఇప్పటికీ ఉన్నాయి. ఈ క్రమంలో టెట్, డీఎస్సీ, బ్యాంక్, ఏపీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కావాల్సిన పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాల వైపు చూడటమే మానేశారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప గ్రంథాలయాలు మనుగడ సాగించలేని దుస్థితి ఏర్పడింది.
జేబులకు చిల్లు..
26 ఏళ్లు పైబడిన యువత ఉద్యోగాల వేట కొనసాగిస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. గ్రామాల నుంచి పట్టణాలు చేరుకొని అద్దె గృహాల్లో ఉంటూ పరీక్షలకు సన్నద్ధమతున్నారు. ఈ క్రమంలో గ్రంథాలయాల్లో తమకు అవసరమైన పుస్తకాలు లేకపోవడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని ప్రయివేట్ బుక్ స్టాల్స్‌లో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు.
కొత్త పుస్తకాలు సరఫరా చేయని చంద్రబాబు ప్రభుత్వం
ఖాళీలు భర్తీ చేయడంలోనూ అలసత్వం
ఆధునిక దేవాలయాలకు
తగ్గుతున్న ఆదరణ
నిరుద్యోగులకు తప్పని అవస్థలు
ప్రభుత్వం చొరవ చూపాలి..
నేను టీటీసీ పూర్తి చేశా. డీఎస్సీకి సన్నద్ధమవుతున్నా. గ్రంథాలయాల్లో నూతన పుస్తకాలు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ తదితర పుస్తకాలు మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని నూతన పుస్తకాలు కొనుగోలు చేయాలి. అలాగే గ్రంథాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలి.
– చంద్రశేఖర్,
మావటూరు, పెనుకొండ మండలం
గ్రంథాలయం.. నిర్వీర్యం
గ్రంథాలయం.. నిర్వీర్యం


