తమ్ముళ్ల బరి తెగింపు | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల బరి తెగింపు

Aug 30 2025 8:50 AM | Updated on Aug 30 2025 10:37 AM

తమ్ము

తమ్ముళ్ల బరి తెగింపు

ఎమ్మెల్యే, ఎంపీపై తిరుగుబావుటా

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోడ్లెక్కుతున్నారు.. నానా యాగీ చేస్తున్నారు.. అధికార మదంతో దాడులకూ దిగుతున్నారు.. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ‘తమ్ముళ్లు’ రచ్చ చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అంతర్గత గొడవలు, వర్గపోరుతో టీడీపీ అట్టుడికిపోతోంది. స్వపక్షంలోనే విపక్షం అన్నట్టు పార్టీలోనే అసమ్మతులు రోజుకో నియోజకవర్గంలో భగ్గుమంటున్నాయి. తెలుగు తమ్ముళ్ల గొడవలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పోలీసులు నిశ్చేష్టుల్లా చూస్తూ ఉండిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. కిందిస్థాయిలో చిన్న ఉద్యోగాలను సైతం ఎమ్మెల్యేలు అమ్ముకుంటుండటంతో పార్టీకి పనిచేసిన వారు రోడ్డెక్కుతున్నారు.

కియా వద్ద మంత్రి అనుచరుల హల్‌చల్‌..

రెండు వారాల క్రితం పెనుకొండలో కియా కార్ల ఉత్పత్తి పరిశ్రమ వద్ద మంత్రి సవిత వర్గీయులు చేసిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. కాంట్రాక్టులన్నీ తమకే కావాలని చేసిన రచ్చ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడిభాగాల పరిశ్రమల నుంచి వచ్చే లారీలను బయటే ఆపేశారు. కియా పరిశ్రమ లోపలకు చొచ్చుకువెళ్లడానికి యత్నించారు. వందల మంది ఒక్కసారిగా రావడంతో పరిశ్రమ యాజమాన్యం ఆందోళన చెందింది. మళ్లీ నాలుగు రోజుల క్రితం టీడీపీ నాయకులు కొందరు గేటు బయట రచ్చ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అర్బన్‌లో ఆధిపత్య పోరు..

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య రోజుకో వివాదంతో గందరగోళం నెలకొంది. ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరుతో ప్రశాంతంగా ఉండే అనంతపురం నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

మద్యం మత్తులో వైద్య సిబ్బందిపై దాడి

కదిరిలో రెండు రోజుల క్రితం మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు హల్‌చల్‌ చేశారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యురాలు రిషిత, నర్స్‌ బాలమునెమ్మ, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక.. ఉరవకొండ నియోజకవర్గం ఆమిద్యాల గ్రామంలో ఆధిపత్య పోరుతో టీడీపీకి చెందిన రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడి ఒకరిని ఒకరు తన్నుకోవడం సంచలనం సృష్టించింది.

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా లక్ష్మినారాయణపై టీడీపీ కార్యకర్తలు తిరుగుబావుటా ఎగురవేయడం గమనార్హం. ఈ క్రమంలోనే శుక్రవారం పచ్చ పార్టీ నాయకులు బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ ఆఫీసు వద్ద ధర్నా చేయడం చూసి జనం నవ్వుకున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లు ఎమ్మెల్యే, ఎంపీ అమ్ముకుంటున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వడం లేదంటూ ఈ సందర్భంగా ‘తమ్ముళ్లు’ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ ఎమ్మెల్యే, ఎంపీ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలపై నిరసనలకు దిగడం జిల్లాలో సంచలనం సృష్టించింది. గతంలో ఎమ్మెల్యే శ్రావణిపై ఇన్‌చార్జ్‌ మంత్రి టీజీ భరత్‌కు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయగం గమనార్హం. తాజా పరిణామాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాలన గాడి తప్పిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు. పోలీసులు నిస్సహాయులుగా మారి అన్నింటినీ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట హల్‌చల్‌

అనంతలో రెండు వర్గాల నడుమ తరచూ ఘర్షణలు

ఇటీవల పెనుకొండలో రెచ్చిపోయిన మంత్రి సవిత వర్గీయులు

రెండు రోజుల క్రితం కదిరిలో వైద్య సిబ్బందిని చితకబాదిన ‘తమ్ముళ్లు’

తాజాగా శింగనమలలో ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా ధర్నా

నిస్సహాయంగా పోలీసులు.. భయకంపితులవుతున్న ప్రజలు

తమ్ముళ్ల బరి తెగింపు1
1/1

తమ్ముళ్ల బరి తెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement